ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌, గల్ఫ్‌ ఆయిల్స్‌ లూబ్రికెంట్స్‌ స్టాక్స్‌ కొనొచ్చా?

15 May, 2023 11:16 IST|Sakshi

ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ ప్రస్తుత ధర: రూ. 96  టార్గెట్‌: రూ. 125 - కొనొచ్చు 
ఎందుకంటే: గతేడాది చివరి త్రైమాసికం(జనవరి–మార్చి)లో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్‌ హోల్డింగ్స్‌ కన్సాలిడేటెడ్‌ నికర లాభం 47 శాతం జంప్‌చేసింది. రూ. 500 కోట్లను తాకింది. రుణ వ్యయాలు తగ్గడం ఇందుకు సహకరించింది. నికర వడ్డీ ఆదాయం 18 శాతం పుంజుకుని రూ. 1,680 కోట్లకు చేరింది. ప్రొవిజన్లకు ముందు నిర్వహణ లాభం(పీపీవోపీ) అంచనాలకు అనుగుణంగా 9 శాతం బలపడి రూ. 1,240 కోట్లయ్యింది. అయితే మొత్తం రుణ ఆస్తులు 8 శాతం క్షీణించాయి. హోల్‌సేల్‌ రుణ ఆస్తులు 53 శాతం నీరసించడం ప్రభావం చూపింది. కాగా.. యాజమాన్య వ్యూహాల ప్రకారం రిటైల్‌ రుణ ఆస్తుల వేగవంత వృద్ధి కొనసాగింది. 35 శాతం ఎగశాయి. దీంతో కంపెనీ రుణ మిక్స్‌లో ప్రస్తుతం రిటైల్‌ రుణ ఆస్తుల వాటా 75 శాతానికి చేరింది. 

ఇటీవల నిర్వహించిన విశ్లేషకుల సమావేశంలో కంపెనీ యాజమాన్యం రిటైల్‌ విభాగంపై మరింత దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది. తద్వారా మొత్తం లోన్‌బుక్‌లో రిటైల్‌ విభాగం పోర్ట్‌ఫోలియోను 90 శాతానికి పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు వీలుగా గ్రామీణ, మైక్రో, గ్రూప్‌ రుణాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలియజేసింది. ఇక మరోవైపు వృద్ధికి వీలుగా అనలిటిక్స్‌పై ప్రత్యేక దృష్టి, ప్రస్తుత కస్టమర్లకు విభిన్న ప్రొడక్టుల విక్రయం, టెక్నాలజీపై నిరవధిక పెట్టుబడులు తదితరాలను చేపడుతోంది. వెరసి 2.8–3 శాతం ఆర్‌వోఏ సాధించే లక్ష్యంగా సాగుతోంది. రిటైల్‌ పోర్ట్‌ఫోలియోను పెంచుకోవడం కంపెనీకి లబ్ధిని చేకూర్చే వీలుంది.

గల్ఫ్‌ ఆయిల్స్‌ లూబ్రికెంట్స్ ప్రస్తుత ధర: రూ. 418 టార్గెట్‌: రూ. 813 కొనొచ్చు 
ఎందుకంటే:
లూబ్రికెంట్స్‌ విభాగంలో దేశీయంగా క్యాస్ట్రాల్‌ తదుపరి రెండో పెద్ద కంపెనీగా గల్ఫ్‌ ఆయిల్‌ లూబ్రికెంట్స్‌ ఇండియా నిలుస్తోంది. మార్కెట్‌ వాటాను పెంచుకోవడంతోపాటు.. గత మూడేళ్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులలోనూ పటిష్టస్థాయిలో కార్యకలాపాలు నిర్వహించడం ద్వారా సమర్ధతను చాటుకుంది. వాణిజ్య వాహన విభాగ వాతావరణం(సైకిల్‌) ఊపందుకోవడం, జాతీయ రహదారులపై రవాణా పుంజుకోవడం, జోరు చూపుతున్న పారిశ్రామికోత్పత్తి, యుటిలిటీ వాహన విక్రయాలలో వృద్ధి వంటి అంశాలు లూబ్రికెంట్స్‌కు డిమాండును పెంచనున్నట్లు అంచనా. వెరసి బిజినెస్‌ టు బిజినెస్‌(బీటూబీ) విభాగం నుంచి లూబ్రికెంట్స్‌ విక్రయాలు ఊపందుకోనున్నాయి. 

ఇది అంతిమంగా కంపెనీకి లబ్ధిని చేకూర్చనుంది. కంపెనీ లూబ్రికెంట్స్, చమురు అమ్మకాల పరిమాణంలో బీటూబీ విభాగం నుంచి 35– 40 శాతం నమోదవుతుండటం కంపెనీకి బలాన్నిస్తోంది. దీనికితోడు అమ్మకాలలో 65 శాతంవరకూ వాటాను ఆక్రమిస్తున్న బిజినెస్‌ టు కన్జూమర్‌(బీటూసీ) లూబ్రికెంట్‌ బిజినెస్‌ విస్తరణపైనా కంపెనీ కన్నేసింది. ఇందుకు అనుగుణంగా కొత్త ప్రాంతాలలో డీలర్‌ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. బీటూబీ బిజినెస్‌తో పోలిస్తే బీటూసీలో మెరుగైన మార్జిన్లు ఆర్జిస్తోంది. ఇలాంటి పలు వ్యూహాత్మక అంశాలు కంపెనీ మార్కెట్‌ వాటాను పెంచనున్నాయి. ఆర్థిక పనితీరు మెరుగుకు దోహదపడనున్నాయి. వెరసి భవిష్యత్‌లో దేశీ లూబ్రికెంట్స్‌ మార్కెట్లో నాయకత్వ స్థాయికి చేరే అవకాశముంది.

గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజ్‌ సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే

మరిన్ని వార్తలు