హైదరాబాద్‌ మెట్రో రికార్డ్‌! ఒక్క రోజులో రూ.13,119 కోట్లు సమీకరణ..

30 Dec, 2021 10:11 IST|Sakshi

ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కేందుకు హైదరాబాద్‌ మెట్రో భారీగా నిధులు సమీకరించింది. నాన్‌ కన్వర్టబుల్‌ డిబెంచర్స్‌ , కమర్షియల్‌ పేపర్ల ద్వారా రూ.13,119 కోట్లు సమీకరించింది. ఒక్కరోజుల్లో ఇంత భారీ మొత్తంలో నిధులు సమీకరించడంలో ఇదో రికార్డుగా నిలిచింది.

ఒక్కరోజులో
నిధుల సమీకరణలో భాగంగా 2021 డిసెంబరు 29 బుధవారం  మూడు రకాలైన బాండ్‌ పేపర్లను ఎల్‌ అండ్‌ టీ జారీ చేసింది. వీటిలో ఒక్కో బాండ్‌ ద్వారా రూ. 2,872 కోట్లు సమీకరించింది.. ఇలా బాండ్‌ పేపర్ల ద్వారా 8,616 కోట్లు సమీకరించింది. ఈ బాండ్‌ పేపర్లకు సంబంధించి వడ్డీ రేంజ్‌ 6.38 శాతం నుంచి 6.68 వరకు ఉంది. ఇక బాండ్‌ పేపర్ల మెచ్యూరిటీ విషయానికి వస్తే మూడేళ్ల నాలుగు నెలలు, నాలుగేళ్ల నాలుగు నెలలు, ఐదేళ్ల నాలుగు నెలలుగా ఉంది. మిగిలిన సొమ్మును కమర్షియల్‌ పేపర్ల ద్వారా సమీకరించింది. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా క్యాపిటల్‌ నిధుల సమీకరణలో భాగస్వామిగా వ్యవహరించింది. మిగిలిన నిధులు కమర్షియల్‌ పేపర్ల ద్వారా సమీకరించింది.

ప్రత్యామ్నాయం
కరోనా సంక్షోభం కారణంగా నష్టాలు పెరిగిపోవడంతో సాఫ్ట్‌లోన్‌ రూపంలో సాయం అందించాల్సిందిగా హైదరాబాద్‌ మెట్రో నిర్వహిస్తోన్న ఎల్‌ అండ్‌ టీ ప్రభుత్వాలను కోరింది. ప్రభుత్వం దగ్గర సాఫ్ట్‌లోన్‌ అంశంలో పెండింగ్‌లో ఉండగానే నిధుల సమీకరణకు ప్రత్యామ్నాయాలను ఎల్‌ అండ్‌ టీ ఏర్పాటు చేసుకుంది. హైదరాబాద్‌ నగరం అభివృద్ధిలో దూసుకుపోతుండటంతో మార్కెట్‌ ద్వారా నిధులు సమీకరణ ఎల్‌ అండ్‌ టీకి సులువైంది.

చదవండి: కరోనా కష్టాలు.. వరుస నష్టాలు.. బయటపడేందుకు ఎల్‌ అండ్‌ టీ కొత్త ప్లాన్‌

మరిన్ని వార్తలు