Infosys: కేంద్రం వర్సెస్‌ ఇన్ఫోసిస్‌.. బిగుస్తున్న పీటముడి

14 May, 2022 16:31 IST|Sakshi

ఉద్యోగుల వలస నియంత్రించేందుకు ఇన్ఫోసిస్‌ కొత్తగా తీసుకువచ్చిన నిబంధన పలు వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.  ముందుగా ఉద్యోగులు యాజమాన్యం మధ్యన మొదలైన వివాదంలోకి  ఇప్పుడు కేంద్ర కార్మిక శాఖ ఎంట్రీ ఇచ్చింది.  ఇన్పోసిస్‌ ఉద్యోగుల సమాఖ్య లేవనెత్తిన ఆరోపణలపై మే 2022 మే 16లోపు రాత పూర్వక సమాధానం ఇవ్వాలని, అదే విధంగా మే 17న జరిగే సమావేశానికి స్వయంగా ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు హాజరు కావాలంటూ స్ఫష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

తమ సంస్థలో రాజీనామా చేసిన ఉద్యోగులు పోటీ సంస్థల్లో ఏడాది పాటు ఉద్యోగాలు చేయొద్దంటూ ఇన్ఫోసిస్‌ విధించిన నియమంతో వివాదం రాజుకుంది. ఏడాది ఉద్యోగాలు చేయకుండా ఇన్ఫోసిస్‌ తమ హక్కులను కాలరాస్తుందంటూ ఉద్యోగుల సమాఖ్య నాసెంట్‌ ఐటీ ఎంపాయిస్‌ సెనెట్‌ కేంద్ర కార్మిక శాఖను ఆశ్రయించింది. నాసెంట్‌ ఫిర్యాదుపై స్పందించిన కార్మిక శాఖ ఈ అంశంపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన సమావేశానికి రావాల్సిందిగా ఇన్ఫోసిస్‌ని కోరింది. అయితే కార్మిక శాఖ కోరినట్టుగా 2022 ఏప్రిల్‌ 28న తాము ఆ సమావేశానికి హాజరు కాలేమంటూ ఇన్ఫోసిస్‌ తెలిపింది. అంతేకాదు అసలు నాసెంట్‌ నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపింది.

ఇన్ఫోసిస్‌ మొదటి దఫా చర్చలకు గైర్హాజరు కావడంతో ఈ సారి కేంద్ర కార్మిక శాఖ ఈ అంశంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇన్ఫోసిస్‌ హెచ్‌ఆర్‌ గ్లోబల్‌ హెడ్‌ క్రిష్‌ శంకర్‌కి కేంద్ర కార్మిక శాఖ డిప్యూటీ చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ రెమిస్‌ తిరు నేరుగా లేఖ రాశారు. నాసెంట్‌ పేర్కొన్న ఫిర్యాదులపై రాత పూర్వకంగా మే 16లోపు సమాధానం ఇవ్వాలని, అంతేకాకుండా మే 17 ఏర్పాటు చేసిన సమావేశానికి తప్పనిసరిగా ఇన్ఫోసిస్‌ ప్రతినిధులు హాజరు కావాలంటూ ఆ లేఖలో స్పష్టం చేశారు. దీనిపై ఇన్ఫోసిస్‌ ఎలా స్పందిస్తుందో చూడాలి. 

చదవండి: ఇన్ఫోసిస్‌ ధిక్కార స్వరం.. కేంద్రంతో చర్చలకు దూరం

>
మరిన్ని వార్తలు