లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌- స్టెర్‌టెక్‌.. జూమ్‌

16 Sep, 2020 10:52 IST|Sakshi

డిజిటల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటుకు ఎయిర్‌టెల్‌తో జత

5 శాతం జంప్‌చేసిన స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ షేరు

క్లిక్స్‌ గ్రూప్‌తో విలీనం- సాధ్యాసాధ్యాల పరిశీలన పూర్తి

10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకిన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌

ఊగిసలాట మధ్య దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 96 పాయింట్లు పుంజుకుని 39,140ను తాకగా.. నిఫ్టీ 25 పాయింట్లు బలపడి 11,547 వద్ద ట్రేడవుతోంది. కాగా..  సానుకూల వార్తల నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ సంస్థ లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌, ఆప్టికల్‌ ఫైబర్‌ సేవల కంపెనీ స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్లు ఇన్వెస్టర్లను ఆకట్టుకుంటున్నాయి. వెరసి భారీ లాభాలతో ఈ రెండు కౌంటర్లూ కళకళలాడుతున్నాయి. వివరాలు చూద్దాం..

లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌
క్లిక్స్‌ గ్రూప్‌తో విలీనానికి వీలుగా సాధ్యాసాధ్యాల నివేదికను సిద్ధం చేసుకున్నట్లు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ తాజాగా వెల్లడించింది. రెండు సంస్థల మధ్యా ఇందుకు అవసరమైన పరిశీలన పూర్తయినట్లు తెలియజేసింది. ఈ ఏడాది జూన్‌లో క్లిక్స్‌ గ్రూప్‌ను బ్యాంకులో విలీనం చేసుకునేందుకు ప్రాథమిక ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం విదితమే. తద్వారా క్లిక్స్‌ క్యాపిటల్‌కున్న రూ. 1900 కోట్ల ఫండ్‌తోపాటు.. రూ. 4,600 కోట్ల ఆస్తులు బ్యాంకుకు బదిలీకానున్నాయి. ఈ నేపథ్యంలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేరు జోరందుకుంది. ఎన్‌ఎస్‌ఈలో ప్రస్తుతం 10 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ను తాకి రూ. 22.40 వద్ద ఫ్రీజయ్యింది.

స్టెరిలైట్‌ టెక్నాలజీస్
ఆధునిక ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసేందుకు మొబైల్‌ సేవల దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్‌తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకున్నట్లు స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ తాజాగా పేర్కొంది. తద్వారా కస్టమర్లకు ప్రపంచస్థాయి సర్వీసులను ఎయిర్‌టెల్‌ అందించే వీలుంటుందని తెలియజేసింది. ఎయిర్‌టెల్‌కు చెందిన 10 సర్కిళ్లలో ఆప్టికల్‌ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది. తాజా నెట్‌వర్క్‌ ద్వారా 5జీ, ఫైబర్‌ టు హోమ్‌, ఐవోటీ తదితర సర్వీసులను ఎయిర్‌టెల్‌ సమర్ధవంతంగా అందజేయవచ్చని వివరించింది. ఈ నేపథ్యంలో స్టెరిలైట్‌ టెక్నాలజీస్‌ కౌంటర్‌ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5 శాతం జంప్‌చేసి రూ. 165 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 167 వరకూ ఎగసింది.

మరిన్ని వార్తలు