ఆర్‌బీఐ షాక్‌ : ఎల్‌వీబీ షేర్లు ఢమాల్‌

18 Nov, 2020 11:35 IST|Sakshi

కుప్పకూలిన లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేరు

లక్ష్మీ విలాస్‌ షేరుకి షాక్‌- 20 శాతం డౌన్‌

20 శాతం డౌన్‌ సర్క్యూట్‌- రూ. 12.45కు షేరు

కనీసం నెల రోజుల మారటోరియం విధించిన కేంద్రం

డీబీఎస్‌ బ్యాంకులో విలీనానికి ఆర్‌బీఐ ప్రతిపాదన

డీబీఎస్‌ బ్యాంకులో విలీనమైతే ఎల్‌వీబీ కార్యకలాపాలు పటిష్టం!

దక్షిణాదిన డీబీఎస్‌ బ్యాంకు కార్యకలాపాల విస్తరణకు చాన్స్‌

తొలిసారి విదేశీ బ్యాంకుతో దేశీ బ్యాంకు విలీనానికి ప్రణాళిక

సాక్షి, ముంబై: బ్యాంకు కార్యకలాపాలపై కేంద్ర ప్రభుత్వం దాదాపు నెల రోజులపాటు మారటోరియంను విధించిన నేపథ్యంలో ప్రయివేట్‌ రంగ బ్యాంకు లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ కౌంటర్లో ఉన్నట్టుండి అమ్మకాలు ఊపందుకున్నాయి. ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టడంతో ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 20 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. అమ్మేవాళ్లు అధికంకాగా.. కొనేవాళ్లు కరవుకావడంతో రూ. 3.10 నష్టంతో రూ. 12.45 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఇంతక్రితం మార్చి 31న నమోదైన ఏడాది కనిష్టం రూ. 10.40కు చేరువైంది. ట్రేడింగ్‌ ప్రారంభమైన తొలి అర్ధగంటలోనే కౌంటర్లో 3.5 కోట్లకుపైగా షేర్ల విక్రయానికి సెల్‌ ఆర్డర్లు(బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ) నమోదైనట్లు మార్కెట్‌ విశ్లేషకులు తెలియజేశారు. 

ఏం జరిగిందంటే?
చెన్నై కేంద్రంగా పనిచేస్తున్న లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ (ఎల్‌వీబీ)పై కేంద్రం మంగళవారం మారటోరియం విధించింది. ఈ నెల 17 నుంచి డిసెంబర్‌ 16 వరకూ 30 రోజులపాటు మారటోరియం అమల్లో ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. బ్యాంక్‌ ఖాతాదారుడు తన ఖాతాలో ఎంత మొత్తం ఉన్నాగానీ రూ.25,000 వరకూ మాత్రమే వెనక్కు తీసుకోగలుగుతాడు. అయితే ఆరోగ్య వ్యయాలు, ఉన్నత విద్యకు చెల్లింపులు, వివాహ ఖర్చుల వంటి అత్యవసరాలకు ఆర్‌బీఐ ముందస్తు అనుమతితో ఖాతాదారుడు రూ.25,000కు మించి తన డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు వీలుంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. బ్యాంక్‌ బోర్డ్‌ను పక్కనబెట్టి కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. బ్యాంక్‌ ఆర్థిక పరిస్థితి దిగజారుతున్న నేపథ్యంలో రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) సలహా మేరకు అత్యవసర ప్రాతిపదికన కేంద్రం ఈ నిర్ణయాన్ని తీసుకుంది.  బ్యాంక్‌ అడ్మినిస్ట్రేటర్‌గా కెనరాబ్యాంక్‌ మాజీ నాన్‌–ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ టీఎన్‌ మనోహరన్‌ను నియమించింది.

తొలిసారి
దేశీ బ్యాంకింగ్‌ చరిత్రలో తొలిసారి విదేశీ బ్యాంకుకు చెందిన దేశీ యూనిట్‌తో దేశీయ బ్యాంకును విలీనం చేసేందుకు ఆర్‌బీఐ ప్రతిపాదించినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఇందుకు ప్రధానంగా డీబీఎస్‌ బ్యాంకు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండటం, విలీనంతో ఎల్‌వీబీ ఖాతాదారులు, ఉద్యోగులకు ప్రయోజనం కలిగే వీలుండటం వంటి అంశాలను ఆర్‌బీఐ పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చని బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొన్నాయి. గతంలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇందుకు ఆర్‌బీఐను సంప్రదించినప్పటికీ అనుమతించకపోవడం గమనార్హం. ఇదే విధంగా క్లిక్స్‌ క్యాపిటల్‌ ప్రతిపాదనకు సైతం నో చెప్పింది. విలీనానికి సంబంధించి రెండు సంస్థల మధ్య ప్రతిపాదించిన వేల్యుయేషన్స్‌ సక్రమంగా లేవన్న కారణం ప్రభావం చూపినట్లు నిపుణులు పేర్కొన్నారు.

డీబీఎస్‌ బ్యాంక్‌తో విలీనం 
తాజా పరిణామాల నేపథ్యంలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ను సింగపూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న బ్యాంకింగ్‌ సేవల దిగ్గజం... డీబీఎస్‌ బ్యాంక్‌ ఇండియా (డీబీఐఎల్‌)తో విలీనానికి ఆర్‌బీఐ ముసాయిదా పథకాన్ని వెలువరించింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ విలీన ప్రతిపాదనకు గ్రీన్  సిగ్నల్‌ లభిస్తే.. భారత్‌లో తమ అనుబంధ సంస్థ  డీబీఐఎల్‌ రూ. 2,500 కోట్ల మేర నిధులు ఇవ్వనున్నట్లు డీబీఎస్‌ వెల్లడించింది. దేశీయంగా డీబీఎస్‌ బ్యాంకు 26 ఏళ్లుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 13 రాష్టాలు, 24 పట్టణాలలో సేవలు విస్తరించింది. ఎల్‌వీబీకి ఎన్‌ఆర్ఐ కస్టమర్లు అధికంగా ఉన్నట్లు బ్యాంకింగ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆసియాలో కార్యకలాపాలు విస్తరించిన డీబీఎస్‌ ఈ కస్టమర్లకు మరింత సులభంగా సర్వీసులు అందించగలుగుతుందని అభిప్రాయపడ్డాయి. డీబీఎస్‌ బ్యాంకులో సింగపూర్‌ ప్రభుత్వానికి చెందిన టెమాసెక్‌ వాటాదారుకావడంతో ఆర్థిక పరిపుష్టిని కలిగి ఉన్నట్లు తెలియజేశాయి. దీంతో ఎల్‌వీబీ విలీనం తదుపరి అవసరమైతే మరిన్ని నిధులతో బ్యాంకు కార్యకలాపాలను విస్తరించగలదని పేర్కొన్నాయి. డీబీఎస్‌ బ్యాంకు ఇంతక్రితం దేశీయంగా మురుగప్ప గ్రూప్‌తో ఏర్పాటు చేసిన ఎన్‌బీఎఫ్‌సీ జేవీ చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్ ఫైనాన్స్‌లోనూ 37.5 శాతం వాటాను సొంతం చేసుకుంది. కాగా.. ఎల్‌వీబీని విలీనం చేసుకుంటే దక్షిణాదిలో కార్యకలాపాలను విస్తరించేందుకు వీలు కలుగుతుందని విశ్లేషకులు తెలియజేశారు. ఎల్‌వీబీ ప్రస్తుతం 563 బ్రాంచీలు, 974 ఏటీఎంలను కలిగి ఉంది. డీబీఎస్‌ బ్యాంకులో ఎల్‌వీబీ విలీనమైతే సంయుక్త సంస్థ 12.51 శాతం సీఆర్‌ఏఆర్‌ను, 9.61 శాతం సీఈటీ-1 క్యాపిటల్‌నూ సమకూర్చుకోగలదని వివరించారు.

మరిన్ని వార్తలు