సరికొత్త ఘనత సాధించిన సూపర్ లగ్జరీ కారు లంబోర్ఘిని ఉరుస్

15 Oct, 2021 15:07 IST|Sakshi

ఇటాలియన్ సూపర్ లగ్జరీ కారు తయారీ కంపెనీ లంబోర్ఘిని సరికొత్త ఘనత సాధించింది. ప్రముఖ లంబోర్ఘిని ఎస్‌యూవీ ఉరుస్ కారు ప్రపంచంలోనే ఎత్తైన లడఖ్ ప్రాంతంలోని ఉమ్లింగ్ లా పాస్ రహదారిపై నడవడం ద్వారా భారతదేశంలో మరో మైలురాయిని సాధించిందని కంపెనీ తెలిపింది. అక్టోబర్ 8, 9న రెండుసార్లు సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉన్న ఉమ్లింగ్ లా పాస్‌లో ఉరుస్ ప్రయాణించడంతో ఇప్పటి వరకు లంబోర్ఘిని ప్రయాణించిన ఎత్తైన ప్రాంతం ఇదేనని లంబోర్ఘిని ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది.

నడపడం కష్టం
ఉమ్లింగ్ లా పాస్‌ అనేది భారతదేశంలోని లడఖ్‌లో ఒక పర్వత మార్గం. ఈ మార్గం సముద్ర మట్టానికి 19,300 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల అక్కడ వాహనం నడపాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఈ మార్గంలో 86 కిలోమీటర్ల దూరం ప్రయాణించి నమ్మశక్యం కాని అద్భుతమైన ఘనత సాధించినట్లు కంపెనీ తెలిపింది. "లంబోర్ఘిని ప్రపంచంలోని అత్యధిక క్లిష్టమైన రహదారిపై నడుస్తున్నపుడు మాకు నిజంగా గర్వించదగ్గ క్షణం" అని లంబోర్ఘిని ఇండియా అధిపతి శ్రీ శరద్ అగర్వాల్ చెప్పారు. (చదవండి: ఆరు రోజులు.. రూ.10.56 లక్షల కోట్ల సంపద)

ఈ సంధర్భంగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బిఆర్ఓ)కు అభినందనలు తెలియజేశారు. లంబోర్ఘిని ఎస్‌యూవీ ఉరుస్ అనేది ఒక సూపర్ స్పోర్ట్స్ కారు. ప్రపంచంలో అన్ని  మార్గాలలో ప్రయాణించే అగ్రశ్రేణి కారు. 4-లీటర్ ట్విన్-టర్బో వి8 ఇంజిన్ తో నడిచే ఈ ఉరుస్ కారు 3.6 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ప్రపంచంలోనే అత్యధిక క్లిష్టమైన రోడ్డులో నడవడంతో తన సామర్థ్యాలను ప్రదర్శించిందని కంపెనీ తెలిపింది. భారతదేశంలో లంబోర్ఘినికి ఉరుస్ ప్రారంభ ధర ₹3.16 కోట్లు (ఎక్స్ షోరూమ్). ఈ సూపర్ లగ్జరీ ఎస్‌యూవీని ప్రస్తుతం 8-10 నెలల ముందు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు