అధిక వ్యయాలతో రియల్టీ ప్రాజెక్టులు అసాధ్యం

7 Mar, 2023 05:56 IST|Sakshi

టాటా రియాలిటీ ఎండీ, సీఈవో

న్యూఢిల్లీ: రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల అభివృద్ధి ఆచరణ సాధ్యం కాని పరిస్థితులు ఉన్నాయని టాటా రియాలిటీ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎండీ, సీఈవో సంజయ్‌ దత్‌ అన్నారు. భూమి ధరలు పెరిగిపోవడం, నిర్మాణ వ్యయం, నిధుల వ్యయాలు పెరిగిపోవడానికి అదనంగా ఆర్థిక అనిశ్చితులను ప్రస్తావించారు. రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టుల అనుమతులు నుంచి అభివృద్ది వరకు అన్ని సులభతరంగా సాగేందుకు భాగస్వాములను జవాబుదారీ చేయాలన్న అభిప్రాయాన్ని దత్‌ వినిపించారు.

‘‘రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులకు పెద్ద మొత్తంలో నిధులు అవసరం. మొదట భూమిని సమీకరించుకోవాలి. నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌), ముంబై, బెంగళూరు తదితర ముఖ్య పట్టణాల్లో ప్రాజెక్టు వ్యయాల్లో భూమి వాటా 50 శాతం నుంచి 80–85 శాతం వరకు ఉంటోంది. ప్రాజెక్టు డిజైన్, అనుమతులు, నిర్మాణ ప్రారంభానికి 2–3 ఏళ్లు పడుతోంది. నిధుల వ్యయాలు ప్రముఖ సంస్థలకు 8.5 శాతంగా ఉంటే, పెద్దగా పేరులేని సంస్థలకు 18 శాతం వరకు ఉంటున్నాయి’’అని సంజయ్‌ దత్‌ వివరించారు. దీంతో ప్రాజెక్టు డెవలపర్లు ప్రస్తుత వ్యయాల ఆధారంగా ధరలను ప్రకటించినప్పటికీ.. ప్రాజెక్టు పూర్తయ్యే 5–6 ఏళ్లలో వ్యయాలు గణనీయంగా పెరుగుతున్నట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు