ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్‌ హబ్‌గా భారత్‌

19 Nov, 2020 10:35 IST|Sakshi

అయిదేళ్లలో రూ.7.5 లక్షల కోట్లకు తయారీ

ఉత్పత్తి పెంచే సామర్థ్యం పరిశ్రమకు ఉంది

సెల్యులార్, ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ వెల్లడి

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్‌ పీసీల తయారీ కేంద్రంగా భారత్‌ మారడం ద్వారా ప్రపంచ మార్కెట్లో గణనీయమైన వాటాను పొందవచ్చు. విధానపర జోక్యంతో వీటి తయారీ పరిశ్రమ దేశంలో 2025 నాటికి రూ.7.5 లక్షల కోట్లకు చేరుకుంటుందని ఇండియన్‌ సెల్యులార్, ఎల్రక్టానిక్స్‌ అసోసియేషన్‌ (ఐసీఈఏ) బుధవారం వెల్లడించింది. ఈ సామర్థ్యం భారత పరిశ్రమకు ఉందని ధీమా వ్యక్తం చేసింది. ఇదే జరిగితే ప్రపంచ ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్స్‌ తయారీ పరిశ్రమలో భారత వాటా ప్రస్తుతమున్న 1 శాతం నుంచి 26 శాతానికి చేరుతుందని తెలిపింది. కొత్తగా 5 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని పేర్కొంది. అలాగే రూ.5.62 లక్షల కోట్ల మేర విదేశీ మారకం భారత్‌కు వస్తుంది. రూ.7,500 కోట్ల విలువైన పెట్టుబడులూ ఉంటాయని ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్ల తయారీ అవకాశంపై ఐసీఈఏ–ఈవై రూపొందించిన నివేదిక తెలిపింది.

ఇదీ ఎలక్ట్రానిక్స్‌ మార్కెట్‌..
భారత్‌లో ఎల్రక్టానిక్స్‌ మార్కెట్‌ రూ.4.87 లక్షల కోట్లకు చేరుకుంది. ఇందులో అత్యధిక వాటా మొబైల్‌ ఫోన్లదేనని అసోసియేషన్‌ చైర్మన్‌ పంకజ్‌ మొహింద్రూ తెలిపారు. ‘ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్ల విషయంలో ఇప్పటికీ దిగుమతులపై భారత్‌ ఆధారపడింది. అయిదేళ్లలో ల్యాప్‌టాప్స్‌ దిగుమతులు 42 శాతం ఎగసి రూ.31 వేల కోట్లు దాటింది. ఈ దిగుమతుల్లో చైనా వాటా ఏకంగా 87 శాతముంది. ఐటీ ఉత్పత్తుల్లో మొబైల్‌ ఫోన్ల తర్వాత ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్‌ వరుసలో ఉన్నాయి. 2019 జాతీయ ఎల్రక్టానిక్స్‌ విధానం ప్రకారం.. 2025 నాటికి దేశంలో ఎల్రక్టానిక్స్‌ తయారీ రూ.30 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా. ఇందులో మొబైల్‌ ఫోన్ల విభాగం నుంచి రూ.14.2 లక్షల కోట్లు సమకూరనుంది’ అని వివరించారు. 

వ్యయాలు తగ్గితే..
దేశంలో ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌ పీసీల మార్కెట్‌ చాలా చిన్నది. ఇక్కడ తయారైనవి అధికంగా యూఎస్, యూరప్‌ తదితర దేశాలకు ఎగుమతి కోసం ఉద్ధేశించినవి. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఎల్రక్టానిక్స్‌ రంగానికి బూస్ట్‌నిస్తోంది. వ్యయాలు తగ్గితే ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్‌ తయారీ అధికమవుతుంది. మొబైల్స్‌ తయారీలో ఉన్న భారతీయ సంస్థలకు ట్యాబ్లెట్స్‌ ఉత్పత్తిలో అపార అవకాశాలు ఉన్నాయి. అధిక విద్యుత్‌ టారిఫ్, పన్నులు, వ్యాపారానికి అనువైన పరిస్థితుల విషయంలో తయారీ సంస్థలకు అడ్డంకులు ఉన్నాయి. దీంతో వియత్నాం, చైనాలతో పోలిస్తే 10–20 శాతం తక్కువ పోటీలో ఉన్నాం. దీర్ఘకాలంలో ఈ సమస్యలను భారత్‌ పరిష్కరించాలి. ఎగుమతుల వృద్ధికి ప్రోత్సాహకాలను అందించాలి అని నివేదిక వెల్లడించింది.  

మరిన్ని వార్తలు