రానున్న రెండు మూడేళ్లలో మార్కెట్‌ జోరు, లార్జ్‌ క్యాప్‌ కంపెనీలపై ఫోకస్‌

20 Sep, 2021 11:09 IST|Sakshi

గడిచిన ఏడాదిన్నర కాలంలో ఈక్విటీ మార్కెట్లలో ఎన్నో ఆటుపోట్లు కనిపించాయి. కరోనా రాకతో కుదేలైన స్టాక్‌ మార్కెట్‌ ఆ తర్వాత ఊహించని రీతిలో కోలుకుని భారీ ర్యాలీతో జీవిత కాల గరిష్టాలకు చేరుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా పుంజుకుంటుందని.. దీంతో వచ్చే రెండు మూడేళ్ల కాలంలోనూ ఈక్విటీ మార్కెట్లు మంచి పనితీరు చూపిస్తాయన్న అంచనాలున్నాయి.

దీంతో లార్జ్‌ క్యాప్‌ కంపెనీలు మంచి పనితీరు చూపించగలవని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విభాగంలో యాక్సిస్‌ బ్లూచిప్‌ పథకం నమ్మకమైన పనితీరును దీర్ఘకాలంగా నమోదు చేస్తూ వస్తోంది. లార్జ్‌క్యాప్‌ పథకాల విభాగం సగటు రాబడులతో పోల్చి చూస్తే రాబడుల పరంగా మెరుగ్గా కనిపిస్తోంది. పరిమిత రిస్క్‌ ఉన్నా ఫర్వాలేదు.. దీర్ఘకాలంలో (ఐదేళ్లకు మించి) మంచి రాబడులు కావాలని కోరుకునే వారు ఈ పథకాన్ని తమ పోర్ట్‌ఫోలియోలోకి పరిశీలించొచ్చు. లార్జ్‌క్యాప్‌ కేటగిరీలో అధిక రాబడులను ఇచ్చిన పథకాల్లో ఇదీ ఒకటి.  

రాబడులు 
దీర్ఘకాలంలో ఈ పథకం రాబడులు ఆకర్షణీయంగా ఉన్నాయి. ముఖ్యంగా గడిచిన ఏడాది కాలంలో 51 శాతం రాబడులను ఇవ్వడం గమనార్హం. ఇక మూడేళ్ల కాలంలో చూస్తే వార్షిక సగటు రాబడులు 19.38 శాతంగా ఉన్నాయి. ఐదేళ్ల కాల వ్యవధిలోనూ యాక్సిస్‌ బ్లూచిప్‌ ప్రదర్శన మెరుగ్గా ఉంది. వార్షికంగా 18 శాతం రాబడులను అందించింది. ఏడేళ్లలో 15 శాతం, పదేళ్లలో 16.64 శాతం చొప్పున ఈ పథకం పెట్టుబడులపై ప్రతిఫలాన్ని తీసుకొచ్చి పెట్టింది. మూడేళ్ల క్రితం రూ.లక్షను ఈ పథకంలో ఇన్వెస్ట్‌ చేసి ఉంటే.. ఇప్పుడు రూ.1.70 లక్షలు అయి ఉండేది.   

నిర్వహణ విధానం 
ఈ పథకం నిర్వహణలో రూ.32,213 కోట్ల పెట్టుబడులున్నాయి. ఇందులో ప్రస్తుతానికి 96.3% ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయగా.. డెట్‌ సాధనాల్లో 2.6%, నగదు నిల్వలను 1.1% చొప్పున కలిగి ఉంది. మార్కెట్‌ అస్థిరతల్లో పెట్టుబడుల వ్యూహాలతో రాబడులను కాపాడే విధానాలను ఈ పథకంలో గమనించొచ్చు. మార్కెట్ల వ్యాల్యూషన్లు అధిక స్థా యిలకు చేరినప్పుడు, ప్రతికూల సమయాల్లోనూ నగదు నిల్వలను పెంచుకోవడం, దిద్దుబాటుల్లో మంచి అవకాశాలను సొంతం చేసుకోవడం వంటివి ఈ పథకం పనితీరు మెరుగ్గా ఉండేలా చేస్తున్నాయి. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో మొత్తం 34 స్టాక్స్‌ ఉన్నాయి. 99% పెట్టుబడులను లార్జ్‌క్యాప్‌నకే కేటాయించడాన్ని చూస్తే.. గరిష్ట వ్యాల్యూషన్ల వద్ద సమీప కాలంలో లార్జ్‌క్యాప్‌ స్టాక్స్‌ బలం గాను, స్థిరంగాను ఉంటాయని ఫండ్‌ బందం అంచనా వేస్తోందని అర్థం చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌కు కేవలం ఒక్క శాతమే కేటాయింపులు చేసింది. బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ స్టాక్స్‌కే ఈ పథ కం ప్రాధాన్యం ఇచ్చింది. 38% పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన స్టాక్స్‌లోనే ఇన్వెస్ట్‌ చేసింది. టెక్నాలజీ రంగ స్టాక్స్‌కు 19%, సేవల రంగ కంపెనీలకు 7.77% చొప్పున కేటాయింపులు చేసింది.

>
మరిన్ని వార్తలు