నిరాశపరిచిన ఎల్‌అండ్‌టీ

28 Oct, 2021 06:14 IST|Sakshi

67 శాతం పడిపోయిన నికర లాభం

ఆదాయంలో వృద్ధి

న్యూఢిల్లీ: నిర్మాణం, ఇంజనీరింగ్‌ దిగ్గజం లార్సన్‌ అండ్‌ టుబ్రో (ఎల్‌అండ్‌టీ) కన్సాలిడేటెడ్‌ (అనుబంధ కంపెనీలు కలిసిన) నికర లాభం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఏకంగా 67 శాతం పడిపోయి రూ.1,819 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.5,520 కోట్లుగా ఉండడం గమనార్హం. మొత్తం ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న రూ.31,594 కోట్ల నుంచి రూ.35,305 కోట్లకు వృద్ధి చెందింది. ‘‘క్రితం ఏడాది సెప్టెంబర్‌ క్వార్టర్‌లో ఎలక్ట్రిక్‌ వ్యాపారాన్ని ష్నీడర్‌కు విక్రయించడంతో పెద్ద ఎత్తున లాభం సమకూరింది.

అలాగే, విదేశీ ఆస్తులకు సంబంధించి ఇంపెయిర్‌మెంట్‌ (పెట్టుబడుల విలువ క్షీణత) కూడా చేయాల్సి వచ్చింది’’ అని ఎల్‌అండ్‌టీ  హోల్‌టైమ్‌ డైరెక్టర్, సీఎఫ్‌వో ఆర్‌ శంకర్‌రామన్‌ తెలిపారు. అటువంటివి సమీక్షా త్రైమాసికంలో లేవని చెప్పారు. నిర్వహణ లాభం 56 శాతం వృద్ధి చెందినట్టు చెప్పారు. నికర లాభంలో ఉత్తరాఖండ్‌లోని హైడల్‌ ప్లాంట్‌లో వాటాల విక్రయం రూపంలో వచ్చిన రూ.144 కోట్లు కూడా ఉన్నట్టు ఎల్‌అండ్‌టీ తెలిపింది. ఇక ఏప్రిల్‌–సెప్టెంబర్‌ ఆరు నెలల కాలంలో కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.2,994 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 49 శాతం తగ్గింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో రూ.42,140 కోట్ల కొత్త ఆర్డర్లను కంపెనీ సంపాదించుకుంది. కంపెనీ చేతిలో మొత్తం రూ.3,30,541 కోట్ల ఆర్డర్లున్నాయి.

మరిన్ని వార్తలు