హైదరాబాద్‌లో చెలరేగిపోతున్న రియల్టీ,గృహ విక్రయాల్లో సరికొత్త రికార్డ్‌లు!

9 Jul, 2022 13:38 IST|Sakshi

11 ఏళ్ల గరిష్టానికి గృహ విక్రయాలు 

2022 హెచ్‌1లో 14,693 యూనిట్ల అమ్మకం

2011 హెచ్‌1 తర్వాత ఇదే అత్యధికం 

32 లక్షల చ.అ. లకు చేరిన ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు 

గతేడాది హెచ్‌1తో పోలిస్తే 101 శాతం వృద్ధి రేటు

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ రియల్టీ తగ్గేదేలే అన్నట్లు చెలరేగిపోతుంది. గృహ విక్రయాలు, లాంచింగ్‌లో రికార్డ్‌ స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఏడాది జనవరి – జూన్‌ (హెచ్‌1)లో ఇళ్ల అమ్మకాలు 11ఏళ్ల గరిష్ట స్థాయికి చేరాయి. కరోనా కారణంగా పెరిగిన ఐటీ నియామకాలు, ఉద్యోగులలో ఆదాయ వృద్ధితో గృహ విక్రయాలు ఊపందుకున్నాయని నైట్‌ఫ్రాంక్‌ ఇండియా నివేదికలో వెల్లడించింది. 2022 హెచ్‌1లో నగరంలో 14,693 గృహాలు అమ్ముడుపోగా.. 21,356 యూనిట్లు లాంచింగ్‌ అయ్యాయి. 

 నగర సిరాస్తి మార్కెట్‌కు ఆయువు పట్టు ఐటీ రంగమే. గృహాలు, ఆఫీస్‌ స్పేస్‌ ఏదైనా ఐటీ నిపుణులను లక్ష్యంగా చేసుకొనే నిర్మాణ సంస్థలు ప్రాజెక్ట్‌లను చేపడుతుంటాయి. వారి అభిరుచులకు అనుగుణంగా ఉండే ఇళ్ల విక్రయాలు హాట్‌కేకుల్లా అమ్ముడవుతాయి. కరోనా కారణంగా ఐటీ కంపెనీలకు విపరీతమైన ప్రాజెక్ట్‌లు వచ్చాయి. దీంతో కొత్త ఉద్యోగుల నియామకాలు పెద్ద ఎత్తున జరగడంతో వారందరూ వారి వారి బడ్జెట్‌లో ఇళ్లను కొనుగోలు చేశారని నైట్‌ఫ్రాంక్‌ హైదరాబాద్‌ డైరెక్టర్‌ శామ్సన్‌ ఆర్థూర్‌ తెలిపారు. 


పశ్చిమానిదే హవా.. 
2021 హెచ్‌1తో పోలిస్తే ఈ ఏడాది హెచ్‌1లో గృహ విక్రయాలలో  23 శాతం, లాంచింగ్స్‌లో 28 శాతం వృద్ధి నమోదయింది. అత్యధికంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఇళ్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతంలో 9,112 యూనిట్లు అమ్ముడుపోగా.. నార్త్‌లో 2,615, సెంట్రల్‌లో 835, ఈస్ట్‌లో 1,363, దక్షిణంలో 768 గృహాలు విక్రయమయ్యాయి. 

4.2 శాతం పెరిగిన ధరలు.. 
ఏడాది కాలంలో నగరంలో ప్రాపర్టీ ధరలలో 4.2 శాతం వృద్ధి నమోదయింది. ప్రస్తుతం ధర చ.అ. సగటు రూ.4,918గా ఉంది. అమ్ముడుపోకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) గతేడాది హెచ్‌1లో 11918 యూనిట్లుగా ఉండగా.. 2022 హెచ్‌1 నాటికి 25262లకు పెరిగాయి. వీటి విక్రయానికి 4.60 త్రైమాసికాల సమయం పడుతుంది. 

కోలుకుంటున్న ఆఫీస్‌ స్పేస్‌
హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్‌ కరోనా కంటే ముందు స్థాయికి చేరుకుంటుంది. 2019 హెచ్‌1లో నగరంలో 38 లక్షల చ.అ. ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరగగా.. ఈ ఏడాది హెచ్‌1 నాటికి 32 లక్షల చ.అ.లకు చేరింది. అయితే గతేడాది హెచ్‌1లో జరిగిన 16 లక్షల చ.అ.లతో పోలిస్తే ఇది 101 శాతం ఎక్కువ. 2015 నుంచి ఇప్పటివరకు నగరంలో అత్యధిక ఆఫీస్‌ స్పేస్‌ లావాదేవీలు జరిగిన అర్ధ సంవత్సరం 2019 హెచ్‌2నే. ఆ సమయంలో రికార్డ్‌ స్థాయిలో 89 లక్షల చ.అ. కార్యాలయ స్థల లావాదేవీలు పూర్తయ్యాయి. 2022 హెచ్‌1లో జరిగిన ఆఫీస్‌ స్పేస్‌ ట్రాన్సాక్షన్స్‌లో బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అండ్‌ ఇన్సూరెన్స్‌ (బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగానిదే పైచేయి. 2021 హెచ్‌1లో ఈ రంగం వాటా 12 శాతంగా ఉండగా.. ఇప్పుడది ఏకంగా 22 శాతానికి పెరిగింది. మిగిలిన రంగాల వాటా చూస్తే ఐటీ 39 శాతం, కో–వర్కింగ్‌ స్పేస్‌ 6 శాతం, తయారీ రంగం 3 శాతం, ఇతర సేవల రంగాల వాటా 30 శాతంగా ఉన్నాయి. 

అదే సమయంలో కొత్త ఆఫీస్‌ స్పేస్‌ నిర్మాణాలలో కూడా వృద్ధి నమోదయింది. గతేడాది హెచ్‌1లో కేవలం 80 వేల చ.అ. ఆఫీస్‌ స్పే స్‌ అందుబాటులోకి రాగా.. ఈ ఏడాది హె చ్‌1 నాటికి 53 లక్షల చ.అ. స్థలం నిర్మాణం పూర్తయింది. ప్రస్తుతం నగరంలో చ.మీ. ఆఫీస్‌ స్పేస్‌ అద్దె రూ.63.7గా ఉంది.

మరిన్ని వార్తలు