దుకాణం.. ఫర్‌ సేల్‌: అమ్మకం బోర్డు పెట్టిన 1,200 మంది!

10 Jun, 2021 02:30 IST|Sakshi

అమ్మకం బోర్డు పెట్టిన 1,200 మంది

లాక్‌డౌన్‌లతో వ్యాపారాలు నడపలేక సతమతం

విక్రయించి బయటపడే ప్రయత్నాలు

లేదంటే ఆర్థిక సాయం కోసం చూపు

న్యూఢిల్లీ: కరోనా దెబ్బకు చిన్న వ్యాపారులు కుదేలయ్యారు! సుదీర్ఘ లాక్‌డౌన్‌లు, ఆంక్షలు, ప్రతికూల ఆర్థిక పరిస్థితులు అన్నీ కలసి చిన్న వ్యాపారాల పాలిట శాపంగా పరిణమించాయి. దీంతో వ్యాపారాలను నడపలేక వాటిని అమ్మేసి బయటపడదామనుకుంటున్నారు. ఒక ఆన్‌లైన్‌ మార్కెట్‌ పోర్టల్‌లో 1,200 మంది తమ వ్యాపారాలను విక్రయానికి పెట్టడం దీన్నే సూచిస్తోంది. లాక్‌డౌన్‌లతో వ్యాపారాలను కొనసాగించలేని పరిస్థితుల్లో ఉన్నకాడికి అమ్ముకుని ఊరట పొందేందుకు మొగ్గుచూపిస్తున్నారు.

లాక్‌డౌన్‌ల ప్రభావం ఎక్కువగా చిన్న టూర్‌ (పర్యాటక) ఆపరేటర్లు, వ్యాయామ కేంద్రాలు (జిమ్‌లు), రెస్టారెంట్లు, ఈవెంట్‌ నిర్వహణ సంస్థలు, సెలూన్‌లు, ప్లే స్కూళ్లు, క్లౌడ్‌ కిచెన్‌లపై ఉన్నట్టు ఎస్‌మెర్జర్స్‌ అనే ఆన్‌లైన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ సంస్థ డేటా తెలియజేస్తోంది. ‘‘సగటున ఒక్కో చిన్న వ్యాపార సంస్థ 2019–20తో పోలిస్తే 2020–21 ఆర్థిక సంవత్సరంలో 30 శాతం మేర ఆదాయం నష్టపోయాయి. ప్రధానంగా రెస్టారెంట్లు, సెలూన్‌లు, సూపర్‌మార్కెట్లు, వినోద కేంద్రాలకు అయితే ఆదాయం 90–95% పడిపోయింది’’ అని ఎస్‌మెర్జర్స్‌ వ్యవస్థాపకుడు విశాల్‌ దేవనాథ్‌ తెలిపారు.  

2021లో భారీ మార్పు..   
2018లో ఎస్‌మెర్జర్స్‌ వేదికపై 3.37 లక్షల కంపెనీలు నమోదు చేసుకున్నాయి. 2019లో 3.86 లక్షల సంస్థలు సాయం కోరుతూ నమోదు చేసుకోవడం గమనార్హం. ఆ తర్వాత వీటి సంఖ్య 6.10 లక్షలు దాటిపోయింది. ఇందులో 32,000 కంపెనీలు 2019లో విక్రయానికి ఉంచినవి కాగా, 2020లో 36,000, 2021లో తొలి నాలుగు నెలల్లోనే 11,000కు వీటి సంఖ్య పెరిగిపోయింది. డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్‌ ఇటీవలే నిర్వహించిన సర్వే ప్రకారం.. కరోనా కారణంగా 82 శాతానికి పైగా వ్యాపార సంస్థలు సమస్యలను ఎదుర్కొంటుండగా.. వీటిల్లో 70 శాతం సంస్థలు కరోనా ముందు నాటి డిమాండ్‌ను చేరుకునేందుకు కనీసం మరో ఏడాది పడుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు