లెజెండ్రీ యాక్టర్‌ ఐకానిక్‌ బంగ్లా, గోద్రెజ్ ప్రాపర్టీస్‌ చేతికి: రణధీర్‌ భావోద్వేగం

17 Feb, 2023 13:32 IST|Sakshi

సాక్షి,  ముంబై: బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్ రాజ్ కపూర్ ముంబై బంగ్లాను దేశంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ గోద్రెజ్ ప్రాపర్టీస్  సొంతం చేసుకుంది. విలాసవంతమైన హౌసింగ్ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయడానికి ముంబైలోని చెంబూర్‌లో ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, నిర్మాత రాజ్కపూర్ బంగ్లాను కొనుగోలు చేసినట్లు గోద్రెజ్ ప్రాపర్టీస్ లిమిటెడ్   శుక్రవారం తెలిపింది. 

కపూర్‌ కుటుంబానికి చెందిన వారసులనుంచి చట్టబద్ధంగా ఈ బంగ్లాను కొనుగోలు చేసినట్లు కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. ఇది ముంబైలోని చెంబూర్‌లోని డియోనార్ ఫామ్ రోడ్‌లో టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (TISS) ప్రక్కనే ఈ బంగ్లా ఉంది. అయితే  కొనుగోలు డీల్ విలువను వెల్లడించలేదు. 

ఈ ఐకానిక్ ప్రాజెక్ట్‌ను  తమ పోర్ట్‌ఫోలియోకు జోడించడం సంతోషంగా  ఉందని,ఈ అవకాశం ఇచ్చిన కపూర్ కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు గోద్రెజ్ ప్రాపర్టీస్ సీఎండీ గౌరవ్ పాండే. ఈ ప్రాజెక్ట్ చెంబూర్‌లో తమ ఉనికిని మరింత బలోపేతం చేయనుందని పాండే చెప్పారు. గతకొన్నేళ్లుగా ప్రీమియం డెవలప్‌మెంట్‌లకు డిమాండ్ బలంగా ఉందన్నారు.

ఈ ఐకానిక్‌ ప్రాపర్టీకి తమ కుటుంబానికీ మధ్య సంబంధం కేవలం భావోద్వేగమైంది మాత్రమే కాదు చారిత్రాత్మక  ప్రాముఖ్యత కూడా ఉందని రణధీర్‌కపూర్‌ ఉద్వేగానికి లోనయ్యారు. గోద్రెజ్ గ్రూప్‌లో భాగస్వామ్యంపై  ఆయన సంతోషం ప్రకటించారు. 2019, మేలో ప్రీమియం మిక్స్డ్ యూజ్ ప్రాజెక్ట్ గోద్రెజ్ ఆర్‌కెఎస్‌ను అభివృద్ధి చేయడానికి కపూర్ కుటుంబం నుండి చెంబూర్‌లోని ఆర్‌కె స్టూడియోస్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం డెలివరీ కానుందని అంచనా.

ఆర్‌కే బంగ్లా లేదా కృష్ణరాజ్‌ బంగ్లా
76 సంవత్సరాల క్రితం 1946లో ఆర్కే కాటేజీగా  నిర్మించారు బాలీవుడ్‌  హీరో రాజ్ కపూర్ . ముంబైలోని పాలి హిల్ ప్రాంతంలో కొలువుదీరిన ఈ అందమైన భవనం ఆర్‌కే బంగ్లా (కృష్ణ రాజ్ బంగ్లా) కొన్ని దశాబ్దాలుగా  పాపులర్‌ అయింది.  అయితే రిషి కపూర్ , నీతూ వివాహం  సందర్భంగా ఈ బంగ్లా పేరును 'కృష్ణ రాజ్ బంగ్లా'గా మార్చారట.  దాదాపు 3 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లాలో రాజ్ కపూర్, భార్య కృష్ణ కపూర్, పిల్లలందరూ  నివసించారు. రాజ్ కపూర్ పిల్లలు రిషి కపూర్, రణధీర్, రాజీవ్ కపూర్ ఈ బంగ్లాలో వివాహం చేసుకున్నారు. గత 76 ఏళ్లుగా, కపూర్ కుటుంబంలోని  వివాహాలు, పెద్ద పెద్ద ఈవెంట్లకు   ఈ బంగ్లానే వేదిక కావడం విశేషం. 


 

మరిన్ని వార్తలు