నాడు రతన్‌ టాటా సాయం.. నేడు వేల కోట్లకు అధిపతి!

10 Mar, 2023 17:11 IST|Sakshi

భారత్‌కు చెందిన స్టార్టప్‌ కంపెనీ లెన్స్‌కార్ట్‌లో అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్‌ అథారిటీ వాటా కొనుగోలు చేస్తున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది. కంపెనీకి చెందిన పాత, కొత్త షేర్లను  500 మిలియన్‌ డాలర్ల (దాదాపు రూ.4100 కోట్లు)తో సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం లెన్స్‌కార్ట్‌ విలువ 4 బిలియన్‌ డాలర్లు (సుమారు రూ.33,000 కోట్లు).

ఇదీ చదవండి: రతన్‌ టాటా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతున్న ఏకైక ప్రొఫైల్‌.. ఎవరిదో తెలుసా?

పీయూష్ బన్సల్, అమిత్ చౌదరి, సుమీత్ కపాహి ఈ లెన్స్‌కార్ట్ సంస్థను స్థాపించారు. ఇందులో కేకేఆర్‌ అండ్‌ కంపెనీ, సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్, టెమాసెక్ హోల్డింగ్స్, ప్రేమ్‌జీ ఇన్వెస్ట్‌ వంటి సంస్థలు  పెట్టుబడులు పెట్టాయి. వీరిలో పీయూష్‌ ప్రముఖ షో షార్క్ ట్యాంక్ ఇండియాలో కనిపించిన తర్వాత సెలబ్రిటీ అయ్యారు. అయితే కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా ఉన్న అమిత్ చౌదరి గురించి చాలా మందికి పెద్దగా తెలియదు.

ఎవరీ అమిత్ చౌదరి?
అమిత్ చౌదరి లెన్స్‌కార్ట్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, కంపెనీకి సీవోవో. అనలిటిక్స్ రంగంలో ప్రావీణ్యం ఉన్న అమిత్‌ చౌదరి కంపెనీని అభివృద్ధి దిశగా ముందుండి నడిపించారు. వ్యాపారంలో వృద్ధిని తీసుకొచ్చిన ఘనత కూడా ఆయనదే. లెన్స్‌కార్ట్ ఆఫ్‌లైన్ స్టోర్‌లను పెంచడంలో కీలకపాత్ర పోషించారు.

కోల్‌కతాలో జన్మించిన అమిత్ చౌదరి స్థానిక భారతీయ విద్యాభవన్‌లో చదువుకున్నారు. బీఐటీ మెస్రా నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఈ పట్టా అందుకున్నారు.  ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటాను తన మెంటర్‌గా చెబుతుంటారు. 2019లో రతన్ టాటాను కలిసిన ఆయన తాను రతన్‌ టాటాను ఎంతలా ఆరాధించేది తెలుపుతూ లింక్‌డిన్‌లో పోస్ట్ చేశారు. ఇది అప్పట్లో పలువురిని బాగా ఆకట్టుకుంది.

రతన్ టాటా అమిత్‌ చౌదరి కోసం 2016లో లెన్స్‌కార్ట్‌లో రూ.10 లక్షలు పెట్టుబడి పెట్టారు. ఇది తిరిగి ఆదాయాన్ని రాబట్టుకునేందుకు కాదు.. కష్టాల్లో ఉన్న స్టార్టప్‌ కంపెనీ అండగా నిలిచేందుకు. అలా అప్పట్లో రతన్‌ టాటా నుంచి సాయం పొందిన ఆయన శిష్యుడు నేడు వేల కోట్లకు అధిపతి అయ్యారు.

ఇదీ చదవండి: సమాచారం ఇవ్వండి.. రూ.20 లక్షలు అందుకోండి! సెబీ నజరానా..

మరిన్ని వార్తలు