2035 నాటికి ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలే లక్ష్యం - నవీన్‌ సోనీ

7 Nov, 2023 07:22 IST|Sakshi

జపాన్‌ లగ్జరీ కార్ల సంస్థ లెక్సస్‌ ఇండియా ఎండీ నవీన్‌ సోనీ

2035 నాటికి పూర్తిగా ఎలక్ట్రిక్‌ కార్ల విక్రయాలే కంపెనీ లక్ష్యం

భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి

మొత్తం కార్ల అమ్మకాల్లో ఇది ఒక శాతం మాత్రమే..

అభివృద్ధి చెందిన దేశాల్లో ఇది 15 శాతం వరకు ఉంది

ఒకసారి చార్జి చేస్తే 1000 కి.మీ. ప్రయాణించే ఎలక్ట్రిక్‌ కార్లు త్వరలో 

సాక్షి, అమరావతి:స్థానిక సంప్రదాయాలు, కళలతో మమేకం అవడం ద్వారా భారతీయ మార్కెట్లో వేగంగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు జపాన్‌కు చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ లెక్సస్‌ ప్రకటించింది. ఇందుకోసం కారు కొనుగోలుదారులను అతిథులుగా గౌరవిస్తూ స్థానిక కళలకు ప్రాచుర్యం కల్పించే విధంగా విశాలమైన ప్రాంగణాలను మెరాకీ పేరుతో ఏర్పాటు చేస్తోంది. దేశంలో అయిదో లెక్సస్‌ మెరాకీని విజయవాడ సమీపంలో మంగళగిరి వద్ద ఏర్పాటు చేసింది. దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోందని, ఇప్పటి వరకు ఈ రంగంలో ఆధిపత్యం ఉన్న జర్మనీ బ్రాండ్‌లకు జపాన్‌ బ్రాండ్‌ గట్టి పోటీనివ్వనుందని లెక్సస్‌ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ నవీన్‌ సోనీ తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన మాటామంతీ..

అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే దేశీయంగా లగ్జరీ కార్ల అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి?
దేశవ్యాప్తంగా ఏటా జరుగుతున్న కార్ల అమ్మకాల్లో కేవలం ఒక శాతం మాత్రమే లగ్జరీ కార్లు ఉంటున్నాయి. ఏటా సుమారుగా 40 లక్షలకు పైగా కార్లు అమ్ముడవుంతుంటే అన్ని లగ్జరీ బ్రాండ్‌లు కలిసి ఏటా 40,000 కార్లను విక్రయిస్తున్నాయి. అదే చైనాలో మొత్తం కార్ల అమ్మకాల్లో 15 నుంచి 16 శాతం, యూరప్‌లో 17 శాతం, అమెరికాలో 14 నుంచి 15 శాతం, జపాన్‌లో 3 నుంచి 5 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి. దీని ప్రకారం చూస్తే వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్‌లో లగ్జరీ కార్ల అమ్మకాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం 3 ట్రిలియన్‌ డాలర్లుగా ఉన్న  స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)ని 5 ట్రిలియన్‌ డాలర్లకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది జరిగితే తలసరి ఆదాయం ప్రస్తుత స్థాయి నుంచి 6 రెట్లు పెరుగుతుంది. ఇదే దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్‌ను శాసించే ప్రధానాంశం.

కోవిడ్‌ తర్వాత పడిపోయిన లగ్జరీ కార్ల అమ్మకాల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది? 
లాక్‌డౌన్‌కు ముందు ఏటా 40 నుంచి 42 వేల లగ్జరీ కార్లు అమ్ముడవుతుంటే అది కోవిడ్‌ సమయంలో 18,000 యూనిట్లకు పడిపోయింది. ఆ తర్వాత సాధారణ కార్ల అమ్మకాలు పెరిగినంత వేగంగా లగ్జరీ కార్ల అమ్మకాలు పెరగలేదు. 2021లో 26,000కు, 2022లో 36,000కు చేరిన లగ్జరీ కార్ల అమ్మకాలు ఈఏడాది 43,000 మార్కును దాటుతాయని అంచనా వేస్తున్నాం. ఇక ఇక్కడ నుంచి ఈ రంగం కూడా వేగంగా వృద్ధి చెందే అవకాశాలున్నాయి.

దేశీయ లగ్జరీ కార్ల మార్కెట్లోకి ఆలస్యంగా ప్రవేశించిన లెక్సస్‌ మార్కెట్‌ అమ్మకాలను పెంచుకోవడానికి ఎటువంటి ప్రణాళికలతో ముందుకు వెళుతోంది? 
రెండేళ్ల క్రితం కేవలం 4 నగరాల్లో ఉన్న లెక్సస్‌కు ఇప్పుడు 19 నగరాల్లో 26 షోరూమ్‌లు ఉన్నాయి. అమ్మకాల సంఖ్యను చెప్పలేను కానీ, దేశీయ మార్కెట్లో లెక్సస్‌ వేగంగా విస్తరిస్తోందని మాత్రం చెప్పగలను. కేవలం కొనుగోలుదారులుగా కాకుండా వారిని అతిథులుగా గౌరవిస్తూ దానికి అనుగుణంగా కార్ల డిజైన్లను రూపొందించి విక్రయించనున్నాం. ఇందుకోసం వేగంగా విస్తరించడం కంటే వినియోగదారు, షోరూమ్‌ భాగస్వాములు ప్రయోజనం పొందే విధంగా అడుగులు వేస్తున్నాం. గతంలో హైదరాబాద్‌కు పరిమితమైన లెక్సస్‌ ఇప్పుడు విజయవాడలో అడుగుపెడుతోంది. రానున్న కాలంలో విశాఖ, నెల్లూరు వంటి నగరాలకు విస్తరణ అవకాశాలను పరిశీలిస్తాం. 

వేగంగా విస్తరిస్తున్న ఎలక్ట్రిక్‌ కార్ల రంగంలో లెక్సస్‌ భవిష్యత్తు ప్రణాళికలేంటి? 
ప్రస్తుతం హైబ్రీడ్‌ మోడల్స్‌లో ఎలక్ట్రిక్‌ కార్లను అందిస్తున్నాం. ఇప్పటికే సింగిల్‌ చార్జీతో 1000 కి.మీ ప్రయాణించే విధంగా కాన్సెప్ట్‌ కారును విడుదల చేశాం. వాణిజ్యపరంగా ఈ కారును 2026 నాటికి విడుదల చేయనున్నాం. 2035 నాటికి లెక్సన్‌ను పూర్తి ఎలక్ట్రిక్‌ కార్ల బ్రాండ్‌గా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

మరిన్ని వార్తలు