శాంసంగ్‌కు చెక్‌పెట్టేందుకు పెద్దప్లానే వేసిన ఎల్‌జీ...!

9 Sep, 2021 20:05 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా పలు మొబైల్‌ కంపెనీల రాకతో మార్కెట్లలో ఎల్‌జీ తన స్థానాన్ని పదిలంగా కాపాడుకోలేకపోయింది. పలు మొబైల్‌ కంపెనీల దెబ్బకు ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ల బిజినెస్‌ను వీడింది. స్మార్ట్‌ఫోన్‌ ఉత్పత్తులను నిలిపివేసిన స్మార్ట్‌ఫోన్లకు ఉపయోగపడే టెక్నాలజీని మాత్రం ఎల్‌జీ వీడలేదు. తాజాగా శాంసంగ్‌ మొబైల్స్‌కు చెక్‌ పెట్టేందుకు ఎల్‌జీ సరికొత్త ప్లాన్‌తో ముందుకురానుంది.  ఎల్‌జీ కంపెనీలలో ఒకటైన ఎల్‌జీ కెమ్‌ (LG Chem) భవిష్యత్తులో వాడే స్మార్ట్‌ఫోన్‌లకు కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్‌తో ముందుకు వచ్చింది.  ఈ కొత్త రకం ఫోల్డబుల్ స్క్రీన్ అధిక ధర గల శామ్‌సంగ్ గెలాక్సీ ఫోల్డ్‌ 3, గెలాక్సీ ఫోల్డ్‌ 2 ఫోన్లలో ఉపయోగించే టెక్నాలజీని ప్రభావితం చేసే అనేక సమస్యలను పరిష్కరిస్తోందని ఎల్‌జీ భావిస్తోంది. 
చదవండి: India’s First Electric Vehicle : భారత తొలి ఎలక్ట్రిక్‌ కారు ఇదేనండోయ్‌..!

మన్నిక ఎక్కువ..! ప్లాస్టిక్‌ లాగా...
ఎల్‌జీ కెమ్‌ తయారు చేసిన ఫోల్డబుల్‌ స్క్రీన్‌ అత్యంత శక్తివంతంగా, మన్నికగా, గాజు తరహాలో అనుభూతిని కలిగించే విధంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. స్క్రీన్‌ మెటిరియల్‌ ప్లాస్టిక్‌ గుణాన్ని పోలీ ఉండనుంది. ఈ  స్క్రీన్‌ను రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్‌గా ఎల్‌జీ పిలుస్తోంది. స్క్రీన్‌ మెటీరియల్‌ని టెంపర్డ్ గ్లాస్‌తో ఎల్‌జీ పోల్చింది. ఈ ఏడాది ప్రారంభంలో ఎల్‌జీ తన కంపెనీ నుంచి రోలబుల్‌ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్‌ చేయాలనే ప్రణాళికలను నిలిపివేసింది.ఎల్‌జీ స్మార్ట్‌ఫోన్ల తయారీ నుంచి వైదొలిగినా.. గూగుల్‌, ఆపిల్‌, షావోమీ, వన్‌ప్లస్‌ వంటి దిగ్గజ స్మార్ట్‌ఫోన్‌ తయారీ దారులకు తన స్క్రీన్‌లను సరఫరా చేయాలనే లక్ష్యాన్ని ఎల్‌జీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది.  


ధరలు తగ్గే అవకాశం..!
శాంసంగ్‌ కొన్ని సంవత్సరాల క్రితం ఫోల్డబుల్‌ ఫోన్లను లాంచ్‌ చేయగా , ఆ స్మార్ట్‌ఫోన్ల ధర గణనీయంగా ఉన్నాయి. ఎల్‌జీ కెమ్‌ తయారుచేసిన స్క్రీన్‌తో ఫోల్డబుల్‌ ఫోన్ల ధరలు గణనీయంగా పడిపోయే అవకాశం ఉందనీ ఎల్‌జీ తెలిపింది. ఎల్‌జి కెమ్ స్క్రీన్‌ మెటీరియల్ తక్కువ మిల్లీమీటర్ల మందాన్ని మాత్రమే కలిగి ఉండనున్నట్లు తెలుస్తోంది. మన్నిక విషయానికి వస్తే ఈ స్క్రీన్‌ను సుమారు 2 లక్షల సార్లు మడత పెట్టవచ్చునని ఎల్‌జీ పేర్కొంది. ఎల్‌జీ కెమ్‌ వచ్చే ఏడాది నుంచి రియల్ ఫోల్డింగ్ విండో స్క్రీన్‌ను భారీ సంఖ్యలో ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తోంది.

చదవండి: భారత్‌కు గుడ్‌బై చెప్పిన మరో దిగ్గజ కంపెనీ..!

మరిన్ని వార్తలు