కొత్త టెక్నాలజీతో ఎల్‌జీ ఫ్రిజ్‌.. ఎక్కడ నుంచైనా ఆపరేట్‌ చేయొచ్చు!

18 Jan, 2023 10:29 IST|Sakshi

పుణెలో 200 కోట్లతో కొత్త యూనిట్‌

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం ఎల్‌జీ మేకిన్‌ ఇండియా నినాదంపై మరింతగా దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా పుణెలో సైడ్‌ బై సైడ్‌ (ఎస్‌ బీ ఎస్‌) ఫ్రిజ్‌ ల తయారీ కోసం కొత్త యూనిట్‌ ప్రారంభించింది.  రూ. 200 కోట్లతో దీన్ని ఏర్పాటు చేసినట్లు సంస్థ భారత విభాగం ఎండీ హోంగ్‌ జు జియోన్‌ తెలిపారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 2 లక్షల యూనిట్లుగా ఉంటుందని వివరించారు. తాజాగా దేశీయంగానే వీటిని తయారు చేయడం వల్ల ధరలు కూడా కొంత తగ్గే అవకాశం ఉంది.

గతేడాదే దేశీయంగా విండో ఏసీల తయారీని ప్రారంభించినట్లు జియోన్‌ చెప్పారు. భారత్‌ లో ఎస్‌ బీ ఎస్‌ ఫ్రిజ్‌ ల విభాగంలో తమకు 50 శాతం మార్కెట్‌ వాటా ఉన్నట్లు ఆయన చెప్పారు.

దేశీయంగా ఫ్రిజ్‌ ల విభాగంలో తమకు 34 శాతం, వాషింగ్‌ మెషీన్ల విభాగంలో 37 శాతం వాటా ఉండగా అన్ని విభాగాల్లోనూ మార్కెట్‌ వాటాను మరింతగా పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు జియోన్‌ చెప్పారు. ఎల్‌జీకి దేశీయంగా పుణె, గ్రేటర్‌ నోయిడాల్లో ప్లాంట్లు ఉన్నాయి. పుణె ప్లాంటుపై 2004 నుంచి గతేడాది వరకూ రూ. 1,619 కోట్లు, నోయిడా ప్లాంటుపై 1997 నుంచి గతేడాది వరకు రూ. 1,778 కోట్లు ఇన్వెస్ట్‌ చేసినట్లు తెలిపారు.  

కొత్త ఫ్రిజ్‌ల శ్రేణి.. 
2023కి సంబంధించి ఎల్‌జీ కొత్త ఎస్‌ బీ ఎస్‌ ఫ్రిజ్‌ ల శ్రేణిని ఆవిష్కరించింది. ఎల్‌జీ థింక్యూ టెక్నాలజీతో వీటిలో టెంపరేచర్‌ సెట్టింగ్‌ వంటి ఫీచర్లను ఎక్కడ నుంచైనా ఆపరేట్‌ చేయొచ్చని సంస్థ తెలిపింది. ఎస్‌ బీ ఎస్‌ ఫ్రిజ్‌ లలో 15 మోడల్స్‌ ఉండగా ధరలు రూ. 1,20,699 నుంచి రూ. 2,29,099గా ఉంటాయని వివరించింది.  

చదవండి: గ్యాస్‌ సిలిండర్‌ డోర్‌ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే!


 

మరిన్ని వార్తలు