కొంపముంచే రుణాలు, తగ్గిన ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభాలు

30 Jul, 2021 07:53 IST|Sakshi

ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ లాభాలకు నిరర్థక రుణాలు (ఎన్‌పీఏలు/వసూలు కాని రుణాలు) గండికొట్టాయి. జూన్‌తో అంతమైన మొదటి త్రైమాసికంలో లాభం గణనీయంగా తగ్గిపోయి రూ.153 కోట్లకు పరిమితమైంది. ఎన్‌పీఏలకు రూ.830 కోట్లను పక్కన పెట్టడం ఇందుకు దారితీసింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో నికర లాభం రూ.817 కోట్లుగా ఉండడం గమనార్హం. నికర వడ్డీ ఆదాయం 4.5 శాతం పెరిగి రూ.1,275 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్‌ అంతకుముందు ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 2.32 శాతం నుంచి 2.20 శాతానికి తగ్గింది. క్యూ1లో రూ.8,652 కోట్ల రుణాలను మంజూరు చేసింది. ఇందులో రూ.7,650 కోట్లు గృహ రుణాలే ఉన్నాయి.

రుణాల మంజూరులో 152 శాతం పురోగతి చూపించింది. ‘‘ఎన్‌పీఏలకు చేసిన కేటాయింపుల వల్లే మా నికర లాభం తగ్గిపోయింది. దీనికితోడు వేతన వ్యయాలు కూడా ప్రభావం చూపించాయి. ఈ పరిస్థితిని దాటి వచ్చామన్న బలమైన నమ్మకంతో ఉన్నాం. రానున్న కాలంలో మంచి వృద్ధి పథంలో కొనసాగుతాం’’ అని సంస్థ ఎండీ, సీఈవో వై విశ్వనాథ గౌడ్‌ తెలిపారు. మూడోదశలోని వసూలు కాని రుణాలు మొత్తం రుణాలో 5.93 శాతానికి పెరిగాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో ఇవి 2.83 శాతంగానే ఉన్నాయి. ఆర్థిక కార్యకలాపాలు బలహీనపడడం వల్ల వసూళ్లు మందగించాయని.. వసూళ్లపై మరింత దృష్టి సారిస్తామని విశ్వనాథగౌడ్‌ చెప్పారు.    

మరిన్ని వార్తలు