ఐపీవో తర్వాత,తొలిసారి ఎల్‌ఐసీ కొత్త ప్లాన్‌..అదేంటో తెలుసా?

31 May, 2022 07:16 IST|Sakshi

హైదరాబాద్‌: జీవిత బీమా పరిశ్రమలో అదిపెద్ద కంపెనీ అయిన ఎల్‌ఐసీ కొత్తగా బీమా రత్న పేరుతో ఒక ప్లాన్‌ను తీసుకొచ్చింది. మే 27వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చింది. ఇది నాన్‌ లింక్డ్‌ (ఈక్విటీలతో సంబంధం లేని), నాన్‌ పార్టిసిపేటింగ్, వ్యక్తిగత, పొదుపు, జీవిత బీమాతో కూడిన ప్లాన్‌ అని ఎల్‌ఐసీ తెలిపింది.


ఇందులో పరిమిత కాలం పాటు ప్రీమియం చెల్లించడం, మనీ బ్యాక్‌ ప్లాన్, గ్యారంటీడ్‌ అడిషన్‌ సదుపాయాలు ఉన్నాయి. 15, 20, 25 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకోవచ్చు. వీటిల్లో ఎంపిక చేసుకున్న ప్లాన్‌ కాల వ్యవధికి నాలుగేళ్లు ముందు వరకు ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 15 ఏళ్ల కాలానికి ప్లాన్‌ తీసుకుంటే 11 ఏళ్లు ప్రీమియం చెల్లింపుల టర్మ్‌ ఉంటుంది. పాలసీదారు జీవించి ఉంటే పాలసీ ప్లాన్‌ గడువు ముగిసే చివరి రెండు సంవత్సరాల్లో ఏటా 25 శాతం బేసిక్‌ సమ్‌ అష్యూర్డ్‌ వెనక్కి వస్తుంది.


గడువు తీరిన తర్వాత మిగిలిన 50 శాతం సమ్‌ అష్యూర్డ్‌ (బీమా)తోపాటు గ్యారంటీడ్‌ అడిషన్స్‌ను ఎల్‌ఐసీ చెల్లిస్తుంది. ఈ ప్లాన్‌ను కనీసం రూ.5 లక్షల కవరేజీ, అంతకంటే ఎక్కువకు తీసుకోవచ్చు. పాలసీపై రుణం తీసుకోవచ్చు. మరణ పరిహారం మొత్తాన్ని ఒకే విడత కాకుండా ఐదేళ్లపాటు తీసుకునే సదుపాయం కూడా ఉంది.

చదవండి👉 చేతుల్లో డబ్బులు లేవా..? అయితే మీ ఎల్‌ఐసీ పాలసీ ప్రీమియంను ఇలా చెల్లించండి...!

మరిన్ని వార్తలు