మార్చికల్లా ఎల్‌ఐసీ ఐపీవో

14 Jan, 2022 03:06 IST|Sakshi

ఈ నెలలో ప్రాస్పెక్టస్‌ దాఖలు!

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూని మార్చికల్లా చేపట్టే వీలున్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఇందుకు వీలుగా ఈ నెలాఖరుకల్లా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాథమిక ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనున్నట్లు తెలియజేశారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గత వారం సంబంధిత మంత్రివర్గంలోని అత్యున్నత అధికారులతో సమీక్ష నిర్వహించడం గమనార్హం!

2021 సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఆర్థిక ఫలితాలకు తుదిరూపునిస్తున్నట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఫండ్‌ విభజన అంశం సైతం తుది దశకు చేరుకుంటున్నట్లు వెల్లడించాయి. ఈ నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదట్లో సెబీకి ప్రాథమిక పత్రాలను దాఖలు చేసే వీలున్నట్లు ఒక అధికారి తెలియజేశారు. వెరసి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) ముగిసేలోగా ఐపీవోను చేపట్టనున్నట్లు విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

కాగా.. మార్చితో ముగియనున్న ఈ ఏడాదిలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా ప్రభుత్వం రూ. 1.75 లక్షల కోట్ల సమీకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు ఎల్‌ఐసీ ఐపీవో కీలకంగా నిలవనున్నట్లు పరిశ్రమ వర్గాలు వివరించాయి.

మరిన్ని వార్తలు