ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూ షురూ..పాలసీదారులకు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు బంపరాఫర్‌..!

27 Apr, 2022 01:19 IST|Sakshi

ఎల్‌ఐసీ రూ.902–949

మే 4 నుంచి పబ్లిక్‌ ఇష్యూ షురూ

22.13 కోట్ల షేర్లు అమ్మకానికి

రూ. 21,000 కోట్ల సమీకరణ లక్ష్యం 

2.21 కోట్ల షేర్లు పాలసీదారులకు  

షేరుకి రూ. 60వరకూ డిస్కౌంట్‌ ∙కనీస బిడ్‌(ఒక లాట్‌) 15 షేర్లు 

ఎట్టకేలకు బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. వచ్చే నెల(మే) 4న ప్రారంభంకానున్న ఇష్యూ 9న ముగియనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు ప్రభుత్వం షేరుకి రూ. 902–949 ధరల శ్రేణి నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాను విక్రయించనుంది. పాలసీదారులకు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు షేరు ధరలో డిస్కౌంట్‌ ప్రకటించింది. 

న్యూఢిల్లీ: ప్రభుత్వం ఎల్‌ఐసీ లిస్టింగ్‌ సన్నాహాలు వేగవంతం చేసింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి సవరించిన ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. తద్వారా తొలుత అనుకున్న 5 శాతం వాటాస్థానే 3.5 శాతాన్నే విక్రయించేందుకు నిర్ణయించింది. వెరసి 22.13 కోట్ల షేర్లను ఆఫర్‌ చేయనుంది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించింది. తద్వారా రూ. 21,000 కోట్లు లభించగలవని ఆశిస్తోంది. కాగా.. ఎల్‌ఐసీ పాలసీదారులకు 2.21 కోట్ల షేర్లను రిజర్వ్‌ చేసింది. వీటిని రూ. 60 డిస్కౌంట్‌ ధరలో విక్రయించనుంది. 15 లక్షల షేర్లను ఉద్యోగులకు కేటాయించనుంది. వీటితోపాటు రిటైలర్లకు రూ. 40 డిస్కౌంట్‌ ధరలో షేర్లను జారీ చేయనుంది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 15 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేయవలసి ఉంటుంది. 

2న షేర్ల జారీ 
ఎల్‌ఐసీ ఐపీవోలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు ప్రభుత్వం మే 2న షేర్ల జారీని చేపట్టనుంది. పాలసీదారులు, వాటాదారులకు రిజర్వ్‌ చేయగా మిగిలిన వాటాలో 50 శాతాన్ని అర్హతగల సంస్థాగత కొనుగోలుదారుల(క్విబ్‌)కు, 35 శాతం రిటైల్‌ ఇన్వెస్టర్లకు, 15 శాతం సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు ఆఫర్‌ చేయనుంది. క్విబ్‌లో 60 శాతం వరకూ యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. నిజానికి ప్రభుత్వం తొలుత 5 శాతం వాటాకు సమానమైన 31.6 కోట్ల షేర్లను విక్రయించాలని ప్రణాళికలు వేసింది. ఇందుకు అనుగుణంగానే సెబీ నుంచి ఆమోదముద్ర పొందింది. అయితే రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం, యూఎస్‌ ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు ఆందోళనల నేపథ్యంలో స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఊగిసలాటకు లోనవుతున్నాయి. ఫలితంగా 3.5 శాతం వాటా విక్రయానికే ఆఫర్‌ను పరిమితం చేస్తూ తాజా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది.  

కనీసం 5 శాతం 
ఎల్‌ఐసీ విలువను రూ. 6 లక్షల కోట్లుగా ప్రభుత్వం మదింపు చేసింది. సెబీ నిబంధనల ప్రకారం రూ. లక్ష కోట్ల విలువగల కంపెనీ ఐపీవోకు వస్తే కనీసం 5 శాతం వాటాను ఆఫర్‌ చేయవలసి ఉంటుంది. దీంతో ప్రభుత్వం 5 శాతం వాటా ఆఫర్‌ నిబంధనల నుంచి ఎల్‌ఐసీకి మినహాయింపులను కోరింది.  

చదవండి: ఎల్‌ఐసీ అమ్మకంతో ఆరు లక్షల కోట్లు!


 

మరిన్ని వార్తలు