LIC IPO: ఐపీవోలో ఎల్‌ఐసీ రికార్డు!

14 May, 2022 12:27 IST|Sakshi

అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా సరికొత్త రికార్డు 

ఎల్‌ఐసీ తుది ధర రూ. 949 

పాలసీదారులకు రూ. 889కు కేటాయింపు  

న్యూఢిల్లీ: బీమా రంగ ప్రభుత్వ దిగ్గజం ఎల్‌ఐసీ పబ్లిక్‌ ఇష్యూలో భాగంగా షేర్ల కేటాయింపును చేపట్టింది. ధరల శ్రేణిలో తుది ధర రూ. 949ను ఖరారు చేసింది. అయితే పాలసీదారులకు రూ. 60 డిస్కౌంట్‌పోను రూ. 889కే షేర్లను జారీ చేసింది. ఈ బాటలో ఉద్యోగులు, రిటైల్‌ ఇన్వెస్టర్లకు రూ. 904 ధర(రూ. 45 రాయితీ)లో షేర్లను కేటాయించగా.. ఇతరులకు రూ. 949 ధరలో షేర్ల జారీని చేపట్టింది. ఇష్యూలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను విక్రయించింది. ఇందుకు రూ. 902–949 ధరల శ్రేణిని ప్రకటించిన సంగతి తెలిసిందే. వెరసి రూ. 20,557 కోట్లు సమకూర్చుకుంది.

ఈ నెల 17న(మంగళవారం) ఎల్‌ఐసీ స్టాక్‌ ఎక్సేంజీలలో లిస్ట్‌కానుంది. దీంతో దేశీ క్యాపిటల్‌ మార్కెట్లో అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా ఎల్‌ఐసీ రికార్డు సృష్టించింది. ఫలితంగా ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించడం ద్వారా రికార్డు నెలకొల్పిన పేటీఎమ్‌ రెండో ర్యాంకుకు చేరింది. ఇక 2010లో రూ. 15,500 కోట్ల విలువైన ఐపీవో చేపట్టిన కోల్‌ ఇండియా, 2008లో రూ. 11,700 కోట్ల ఇష్యూకి వచ్చిన రిలయన్స్‌ పవర్‌ తదుపరి ర్యాంకుల్లో నిలిచాయి.
చదవండి: ఎల్‌ఐసీ.. షేర్ల అలాట్‌మెంట్‌పై సుప్రీం కోర్టు కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు