లిస్టెడ్‌ సంస్థల చేతిలో 60 శాతం బీమా వ్యాపారం

23 Aug, 2021 05:56 IST|Sakshi

ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి అమిత్‌ అగర్వాల్‌

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ దిగ్గజం ఎల్‌ఐసీ కూడా పబ్లిక్‌ ఇష్యూ పూర్తి చేసుకుని లిస్టయితే.. దేశీయంగా బీమా వ్యాపారంలో దాదాపు 60 శాతం వాటా లిస్టెడ్‌ కంపెనీలదే ఉంటుందని ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి అమిత్‌ అగర్వాల్‌ తెలిపారు. యాక్చువేరీస్‌ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయం వెల్లడించారు. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ విస్తృతమైన, పటిష్టమైన ఆర్థిక విధానాలతో వర్ధమాన ఎకానమీగా భారత్‌ వృద్ధి బాటలో ముందుకు సాగుతోందని అగర్వాల్‌ చెప్పారు. రెండు దశాబ్దాల క్రితం బీమా రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టిన తర్వాత నుంచి ఇన్సూరెన్స్‌ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందిందని ఆయన పేర్కొన్నారు. 2000 సంవత్సరంలో ఎనిమిది సంస్థలు ఉండగా.. ప్రస్తుతం వీటి సంఖ్య 69కి చేరిందని వివరించారు. ప్రస్తుతం నాలుగు జీవిత బీమా సంస్థలు, రెండు సాధారణ బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ రంగ రీ–ఇన్సూరెన్స్‌ సంస్థ జనరల్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా కూడా లిస్టయిన బీమా కంపెనీల్లో ఉన్నాయి.

మరిన్ని వార్తలు