హిమ్మత్‌ రఖనా అంటూ కన్నుమూసిన అమ్మానాన్న, ఎల్‌ఐసీ నోటీసులు, నెటిజనుల స్పందన

6 Jun, 2022 18:01 IST|Sakshi

సాక్షి, ముంబై:  కరోనా మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన  పిల్లలకు బీమా సంస్థ ఎల్‌ఐసీ లోన్ రికవరీ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.   చివరికి ఈ విషయం కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్‌కు దృష్టికి  చేరింది. వెంటనే దీనిపై జోక్యం చేసుకున్న ఆమె ఈ విషయాన్ని పరిశీలించి తనకు  వివరాలు అందించాల్సిందిగా ఎల్‌ఐసీని  ఆదేశించింది.

వివరాల్లోకి వెళితే...మధ్యప్రదేశ్ లోని భోపాల్‌కు చెందిన జితేంద్ర పాఠక్ ఎల్ఐసీ ఏజెంటుగా పనిచేసేవారు. తల్లి ప్రభుత్వ టీచరు. ఎల్ఐసీ నుంచి ఇంటి కోసం రూ.29 లక్షల రుణం తీసుకున్నారు. అయితే గత ఏడాది జితేంద్ర, ఆయన భార్య డా. సీమా పాథక్‌ను కూడా కరోనా పొట్టన పెట్టుకుంది. అప్పటికి వనిషా వయసు 17 సంవత్సరాలు. ఈమెకు పదకొండేళ్ల తమ్ముడు కూడా ఉన్నాడు.

అయితే  29 లక్షల రూపాయల లోన్ తీర్చాలంటూ  వనిషా పాఠక్‌కు నోటీసులు పంపింది ఎల్‌ఐసీ.  తక్షణమే లోన్ చెల్లించాలని, లేదంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలంటూ హెచ్చరించింది. ఈ వ్యవహారంపై  మీడియాలో కథనాలు రావడంతో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పరిశీలించాల్సిందిగా జూన్ 5న ఎల్‌ఐసీ, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌ని ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. అయితే పిల్లల బంధువులు తమ కార్యాలయాన్ని సందర్శించి పరిస్థితిని తెలియజేశారని ఎల్‌ఐసీ తెలిపింది. ఇకపై ఎలాంటి నోటీసులు అందవని హామీ ఇస్తూ ఏప్రిల్‌లో లేఖ పంపినట్లు కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. అయితే బాధితుల స్పందన భిన్నంగా ఉంది. ఇదే నిజమైతే మళ్లీ నోటీసులు ఎందుకు వచ్చాయని వనిషా  ప్రశ్నించింది. 

కాగా వనిషా పాఠక్, ఆమె సోదరుడిని ప్రస్తుతం మేనమామ సంరక్షణలో ఉన్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులను కోల్పోయిన పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి వనిషా 10వతరగతి సీబీఎస్‌ఈ పరీక్షలలో ఇంగ్లీష్, సంస్కృతం, సైన్స్, సోషల్ సైన్స్‌లో 100 మార్క్‌లు, గణితంలో 97 స్కోర్ చేయడం విశేషం.

అంతేకాదు ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న వనిషా పాఠక్‌ ఐఐటీ లేదా యూపీఎస్‌సీ పరీక్షల్లో మెరిట్‌ సాధించి తన తల్లిదండ్రుల కలను నెరవేర్చాలని భావిస్తోందట. దేశానికి సేవ చేయాలని తండ్రి కోరిక అని.. ఇపుడు అది తన డ్రీమ్‌ అని చెప్పింది. అలాగే అద్భుతమైన కవిత్వంతో  అమ్మ నాన్నాలకు ఘనమైన నివాళి అర్పించడమే కాదు ఆ దుఃఖాన్ని, కన్నీళ్లను దిగమింగుకుంటూ ముందుకు సాగుతోంది.

మరోవైపు ఈ విషయాన్ని తెలుసుకున్న నెటిజనులు వనిషాకు, ఆమె తమ్ముడికి సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఎల్‌ఐసీ రుణాన్ని తీర్చి, ఆమె చదువు కయ్యే ఖర్చును భరించేందుకు కూడా కొందరు సిద్ధంగా ఉన్నామని తెలిపారని పిల్లల మేనమామ చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడేందుకు సాయం చేస్తామంటూ ఫోన్లు వస్తూనే ఉన్నాయనీ ఆయన తెలిపారు. అయితే లోన్ రీపేమెంట్‌లో ఎల్‌ఐసీ నుంచి కొంత సడలింపు లభిస్తే.. అదే పెద్ద సహాయం అవుతుందన్నారు.

మరిన్ని వార్తలు