ఐడీబీఐలో కొంత వాటాకు ఓకే..బ్యాంకెస్యూరెన్స్‌ కోసం ఎల్‌ఐసీ యోచన

3 May, 2022 11:57 IST|Sakshi

న్యూఢిల్లీ: బ్యాంకెస్యూరెన్స్‌ చానల్‌తో లబ్ది పొందేందుకు వీలుగా ఐడీబీఐ బ్యాంకులో బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీ కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉంది. డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా బ్యాంకులో ప్రభుత్వంసహా ఎల్‌ఐసీ వాటా విక్రయించే సన్నాహాల్లో ఉంది. ప్రస్తుతం ఎల్‌ఐసీ ఈ నెల 4న ప్రారంభంకానున్న సొంత పబ్లిక్‌ ఇష్యూకి సంబంధించిన రోడ్‌షోల నిర్వహణలో ఉంది. 

ఈ నేపథ్యంలో బ్యాంకులో పూర్తి వాటాను విక్రయించబోమని ఎల్‌ఐసీ చైర్మన్‌ ఎంఆర్‌ కుమార్‌ పేర్కొన్నారు. గత కొన్నేళ్లుగా ప్రభుత్వం బ్యాంకులోగల 45 శాతం వాటా విక్రయ ప్రణాళికల్లో ఉంది. ఐడీబీఐ బ్యాంక్‌ ప్రయివేటైజేషన్‌ ప్రక్రియ జరుగుతున్నదని, ఎంతమేర వాటాను విక్రయించేదీ ఎల్‌ఐసీ రోడ్‌షోల తదుపరి నిర్ణయించనున్నట్లు గత వారం దీపమ్‌ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే వెల్లడించారు. 

కాగా.. 2019 జనవరి 21నుంచి ఎల్‌ఐసీకి ఐడీబీఐ బ్యాంక్‌ అనుబంధ సంస్థగా మారిన విషయం విదితమే. ఎల్‌ఐసీకి 49.24 శాతం వాటా ఉంది. బ్యాంక్‌ బ్రాంచీల నెట్‌వర్క్, కస్టమర్ల ద్వారా ఇన్సూరెన్స్‌ ప్రొడక్టుల విక్రయానికి బ్యాంకెస్యూరెన్స్‌ దోహదపడుతుంది. దీంతో ఎల్‌ఐసీ బ్యాంకులో కొంతమేర వాటాను కొనసాగించే యోచనలో ఉన్నట్లు కుమార్‌ తెలియజేశారు.   

మరిన్ని వార్తలు