ఎల్‌ఐసీ నుంచి కొత్త హెల్త్‌ ఇన్ఫూరెన్స్‌ ప్లాన్‌

21 Jul, 2021 14:35 IST|Sakshi

హైదరాబాద్‌: ఎల్‌ఐసీ "అరోగ్య రక్షక్‌" పేరుతో ఒక హెల్త్‌ ఇన్ఫూరెన్స్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ జోనల్‌ మేనేజర్‌ ఎం.జగన్నాథ్‌ బెంగళూరులో ఈ పాలసీని ప్రారంభించారు. నిర్దేశిత ఆరోగ్య సమస్యలకు ఈ ప్లాన్‌ స్థిరమైన ప్రయోజనాన్ని అందిస్తుంది. ఒకే ప్లాన్‌లో కుటుంబ సభ్యులందరూ భాగం కావచ్చు. ఒక్కరే విడిగానూ తీసుకోవచ్చు. 18-45 ఏళ్ల వయసులోని వారు ఎవరైనా ప్లాన్‌ను ప్రాథమిక పాలసీదారుగా తీసుకోవచ్చు. ఇందులో 91 రోజుల నుంచి 20 ఏళ్ల వయసు పిల్లలకూ కవరేజీ ఉంటుంది. పిల్లలకు అయితే 25 ఏళ్లు వచ్చే వరకు, ఇతర కుటుంబ సభ్యులకు 80 ఏళ్లు వచ్చే వరకు రెన్యువల్‌ చేసుకోవచ్చు. 

తమకు అనుకూలమైన స్థిర ప్రయోజనాన్ని ఇందులో ఎంపిక చేసుకోవచ్చు. ప్రీమియం చెల్లింపులోనూ పలు అష్టన్లు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరితే వైద్య ఖర్చులతో సంబంధం లేకుండా పాలసీదారు ఎంపిక చేసుకున్న మొత్తాన్ని బీమా సంస్థ చెల్లిస్తుంది. ఆటో స్టెపప్‌, నో శ్లేయమ్‌ బెనిఫిట్‌ రూపంలో కవరేజీ పెంచుకునేందుకు అవకాశం ఉంది. పాలసీదారు తనతో పాటు తన కుటుంబం అంతటికీ ప్లాన్‌ను తీసుకున్న తర్వాత.. ఏదేనీ కారణంతో ప్రాధమిక పాలసీదారు మరణించినట్టయితే, ఆ తర్వాత నుంచి ప్రీమియం చెల్లింపు రద్దయ్యే అప్షన్‌ కూడా ఉంది. రైడర్లు కూడా ఉన్నట్టు ఎల్‌ఐసీ తెలిపింది.

మరిన్ని వార్తలు