LIC IPO: ఎల్‌ఐసీ ఐపీవో.. క్యూకడుతున్న యాంకర్‌ ఇన్వెస్టర్లు!

3 May, 2022 08:26 IST|Sakshi

న్యూఢిల్లీ: బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌(ఎల్‌ఐసీ) పబ్లిక్‌ ఇష్యూకి యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించింది. ఐపీవోలో భాగంగా ప్రభుత్వం 3.5 శాతం వాటాకు సమానమైన 22.13 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తోంది. తద్వారా రూ. 21,000 కోట్లవరకూ సమీకరించే ప్రణాళికల్లో ఉంది. ఇష్యూలో భాగంగా యాంకర్‌ ఇన్వెస్టర్లకు 5.92 కోట్ల షేర్లను రిజర్వ్‌ చేసింది. వీటి విలువ రూ. 5,620 కోట్లు కాగా.. సోమవారం(2న) ఈ విభాగంలో రూ. 7,000 కోట్ల విలువైన బిడ్స్‌ దాఖలైనట్లు తెలుస్తోంది.  

ప్రధానంగా సావరిన్‌ వెల్త్‌ఫండ్స్, దేశీ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఆసక్తి చూపినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే 20 యాంకర్‌ సంస్థలు ఆసక్తి చూపినట్లు వార్తలు వెలువడ్డాయి. కాగా.. షేరుకి రూ.902–949 ధరలో చేపట్టిన ఇష్యూ బుధవారం(4న) ప్రారంభమై సోమవారం(9న) ముగియనుంది.

 

అతిపెద్ద ఇష్యూ..: రూ. 21,000 కోట్ల సమీకరణ ద్వారా దేశీయంగా ఎల్‌ఐసీ అతిపెద్ద పబ్లిక్‌ ఇష్యూగా రికార్డు సృష్టించనుంది. ఇంతక్రితం 2021లో రూ. 18,300 కోట్లు సమీకరించిన వన్‌97 కమ్యూనికేషన్స్‌(పేటీఎమ్‌) ఇప్పటివరకూ భారీ ఐపీవోగా నిలుస్తోంది. 2010లో రూ. 15,200 కోట్ల సమీకరణతో లిస్టింగ్‌ సాధించిన పీఎస్‌యూ దిగ్గజం కోల్‌ ఇండియా తదుపరి ర్యాంకును సాధించింది. కాగా.. తాజా ఐపీవోలో ఎల్‌ఐసీ పాలసీదారులకు 2,21,37,492 షేర్లు, ఉద్యోగులకు 15,81,249 షేర్లు విక్రయించనుంది. పాలసీదారులకు షేరు ధరలో రూ. 60, రిటైల్‌ ఇన్వెస్టర్లు, ఉద్యోగులకు రూ. 45 చొప్పున రాయితీని ఇస్తోంది. ఈ నెల 17న ఎల్‌ఐసీ లిస్ట్‌కానుంది.

చదవండి👉ఎల్‌ఐసీ షేరు ధర ఆకర్షణీయం...

మరిన్ని వార్తలు