ఎల్‌ఐసీ ఫ్లాప్‌ షో, మార్కెట్‌ క్యాప్‌ ఢమాల్‌: షాక్‌లో ఇన్వెస్టర్లు

6 Jun, 2022 17:07 IST|Sakshi

సాక్షి,ముంబై:అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ)కి మార్కెట్లో వరుసగా ఐదో సెషన్‌లోనూ అమ్మకాల సెగ  తాకింది.  ఇన్వెస్టర్ల ఎడ తెగని అమ్మకాలతో సోమవారం ఎస్‌ఐసీ మరింత  దిగజారి  ఆల్‌ టైం కనిష్టానికి చేరింది. ఫలితంగా సంస్థ మార్కెట్‌ క్యాప్‌ 5 లక్షల కోట్ల రూపాయల దిగువకు పడిపోయింది. ఇది లిస్టింగ్‌ నాటికి రూ.6 లక్షల కోట్లకు పై మాటే.  ఈ స్థాయికి దిగజారడం ఇదే తొలిసారి.

సోమవారం నాటి అమ్మకాలతో  ఎల్‌ఐసీ  షేరు 2.86 శాతం క్షీణించి రికార్డు ముగింపు కనిష్టం రూ.777.40 వద్ద స్థిరపడింది. బీఎస్‌ఈఇండెక్స్‌లో ఈ స్టాక్ ఆల్-టైమ్ ఇంట్రాడే కనిష్ట స్థాయి రూ. 775.40ని తాకింది. దీంతో మార్కెట్ విలువ 4.97 లక్షల కోట్లకు చేరింది. అయితే  భవిష్యత్తులో మరింత అమ్మకాల ఒత్తిడి ఎదుర్కోనుందని, యాంకర్ ఇన్వెస్టర్ల  లాక్-ఇన్ పీరియడ్‌ ముగియనున్న నేపథ్యంలో  రూ. 750 వద్ద మరింత దిగజారే అవకాశం ఉందని స్టాక్ మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.

ఎల్‌ఐసీ షేరు లిస్టింగ్‌ ప్రైస్‌ (మే 17న) రూ. 949 నుండి 18.08 శాతం కుప్ప కూలింది.  ఎఫ్‌ఐఐల భాగస్వామ్యం దాదాపు శూన్యం కావడం, లాక్‌ ఇన్‌ పీరియడ్‌ ముగియనుండటంతోపాటు, క్యూ4 ఫలితాలు ప్రోత్సాహకరంగా లేకపోవడంతో మరింత దిగజారవచ్చని, పొజిషనల్ ఇన్వెస్టర్లు అప్రమత్తంగాఉండాలని మార్కెట్ నిపుణుడు ఎస్‌ఎంసి గ్లోబల్ సెక్యూరిటీస్ రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ సౌరభ్ జైన్ సూచించారు. దీంతో ఇప్పటికే ఇన్వెస్ట్‌ చేసిన ఇన్వెస్టర్లు లబోదిబో మంటున్నారు. అయితే లాంగ్‌ టర్మ్‌ ఇన్వెస్టర్లు పెద్దగా చింతించాల్సిన అవసరం లేదని నిపుణులు పేర్కొంటున్నారు.

కాగా మార్చి 2022 త్రైమాసికంలో సంస్థ వార్షిక ప్రాతిపదికన ఏకీకృత నికర లాభం 17 శాతం క్షీణించి 2,410 కోట్లు రూపాయలుగా ఉంది. అయితే నికర ఆదాయం 17.9 శాతం పెరిగి రూ.1.4 లక్షల కోట్లకు చేరింది, క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలోరూ.1.2 లక్షల కోట్లుగా ఉంది.

మరిన్ని వార్తలు