బ్యాంకింగ్‌ లిక్విడిటీలో తీవ్ర ఒడిదుడుకులు!

9 Dec, 2021 12:57 IST|Sakshi
24యేళ్లలో ఐదవసారి అనూహ్య ధోరణి. నవంబర్‌ 5 – నవంబర్‌ 19 మధ్య ద్రవ్య పరిస్థితిపై ఎస్‌బీఐ నివేదిక. స్టాక్‌ మార్కెట్‌ ప్రేరిత  అంశాలూ కారణమని విశ్లేషణ.

ముంబై: బ్యాంకింగ్‌ లిక్విడిటీ (ద్రవ్య లభ్యత)లో గత నెల నవంబర్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.  బ్యాంక్‌ డిపాజిట్లు 2021 నవంబర్‌ 5తో ముగిసిన 15 రోజుల్లో భారీగా రూ.3.3 లక్షల కోట్లు పెరిగాయి. పక్షం రోజుల్లో ఇంత స్థాయిలో డిపాజిట్ల పెరుగుదల 24 సంవత్సరాల్లో (1997 తరువాత) ఇది ఐదవసారి. అయితే నవంబర్‌ 5 నుంచి మరో పక్షం రోజులు గడిచేసరికి అంటే 2021 నవంబర్‌ 19వ తేదీ నాటికి బ్యాంక్‌ డిపాజిట్లు భారీగా రూ.2.7 లక్షల కోట్లు క్షీణించాయి. ఒక్కసారిగా ఇలా బ్యాంక్‌ డిపాజిట్ల పెరుగుదల– క్షీణతలకు కారణమేమిటన్న అంశంపై ఎస్‌బీఐ రిసెర్చ్‌ దృష్టి సారించింది. నిజానికి దీపావళి వారంలో కరెన్సీ డిపాజిట్ల ఒడిదుడుకులకు కారణం ఏమిటన్నది నివేదిక దృష్టి సారించిన అంశం. స్టాక్‌ మార్కెట్‌ ర్యాలీ అంచనాలుసహా పలు అంశాలను నివేదిక ప్రస్తావించింది.  స్టేట్‌ బ్యాంక్‌ గ్రూప్‌ ముఖ్య ఆర్థిక సలహాదారు సౌమ్య కాంతి ఘోష్‌ ఈ నివేదికాంశాలను వెల్లడించారు.
 
ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. 

భారీ డిపాజిట్లు కేవలం కొన్ని సందర్భాల్లోనే చోటుచేసుకున్నాయి. 1997లో ఈ తరహా భారీ డిపాజిట్ల పరిణామం చోటుచేసుకుంది. అటు తర్వాత 2016 నవంబర్‌ 25 వరకు అంటే పెద్ద నోట్‌ బ్యాన్‌ తర్వాత పక్షం రోజులలో రూ. 4.16 లక్షల కోట్ల డిపాజిట్లు జరిగాయి. అంతక్రితం 26 సెప్టెంబర్‌  2016 వరకు జరిగిన పక్షం రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. 29 మార్చి 2019 నాటికి పక్షం రోజుల్లో రూ. 3.46 లక్షల కోట్లు డిపాజిట్లు జరిగాయి.అంతక్రితం  ఏప్రిల్‌ 1, 2016తో ముగిసిన పక్షం రోజుల్లో రూ. 3.41 లక్షల కోట్ల డిపాజిట్లు వచ్చాయి. మళ్లీ అంత స్థాయిలో  2021 నవంబర్‌ 5తో ముగిసిన 15 రోజుల్లో భారీగా రూ.3.3 లక్షల కోట్ల డిపాజిట్లు          జరిగాయి.  

2016 నవంబర్‌ 25తో ముగిసిన పక్షం రోజుల్లో జరిగిన భారీ డిపాజిట్లు (రూ.4.16 లక్షల కోట్లు) పెద్ద నోట్ల రద్దు ప్రభావమన్నది సుస్పష్టం. అదే ఏడాది  ఏప్రిల్‌ 1తో ముగిసిన పక్షం రోజుల్లో జరిగిన డిపాజిట్లు (రూ.3.41 లక్షల కోట్లు) సీజనల్‌ సంవత్సరాంత అధిక డిపాజిట్లుగా భావించవచ్చు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి మూడు నెలల ముందు (26 సెప్టెంబర్‌  2016 వరకు జరిగిన పక్షం రోజుల్లో రూ. 3.55 లక్షల కోట్ల డిపాజిట్లు) భారీ డిపాజిట్లు జరగడం గమనార్హం.  

డిపాజిట్లు, ఉపసంహరణల్లో భారీ ఒడిదుడుకుల పరిస్థితులు  లిక్విడిటీ (ద్రవ్య లభ్యత) నిర్వహణ, ఆర్థిక స్థిరత్వం లేదా డిజిటలైజేషన్‌ ద్వారా కస్టమర్‌ చెల్లింపు అలవాట్లలో ప్రవర్తనా ధోరణిలో మార్పు వంటి అంశాలను నిశితంగా గమనించాల్సిన అవసరాన్ని ప్రతిబింబిస్తోంది. 

కంపెనీల ఐపీఓలు, స్టాక్‌ మార్కెట్లు భారీగా పెరగవచ్చన్న అంచనాలు నవంబర్‌ 5తో ముగి సన పక్షం రోజుల్లో డిపాజిట్లు భారీగా పెరగడానికి కారణం కావచ్చు. అటువంటి ర్యాలీ కార్యరూపం దాల్చకపోవడంతో డిపాజిట్లు భారీగా వెనక్కు మళ్లి ఉండచచ్చు.  

ఎన్‌ఎస్‌ఈ డేటా ప్రకారం, 2021 సెప్టెంబర్‌లో నెలవారీ ఇన్వెస్టర్‌ రిజిస్ట్రేషన్ల సంఖ్య రికార్డు స్థాయిలో 15.6 లక్షలకు చేరింది. 2021 ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ మధ్య దాదాపు 50 లక్షల మం ది అదనపు కొత్త ఇన్వెస్టర్లు రిజిస్టర్‌ అయ్యారు.  

బ్యాంకుల్లో భారీ డిపాజిట్ల నేపథ్యంలో స్థిర రివర్స్‌ రెపో విండో (బ్యాంకులు తమ అదనపు నిధులను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్‌ చేయడానికి ఉద్దేశించింది. దీనిపై వడ్డీరేటు ప్రస్తుతం 3.35 శాతం) మొత్తాలు భారీగా పెరిగాయి. అక్టోబర్‌ 19న రివర్స్‌ రెపో పరిమాణం 0.45 లక్షల కోట్లయితే, నవంబర్‌ 19 నాటికి ఈ పరిమాణం రూ.2.4 లక్షల కోట్లకు ఎగసింది. 2021 డిసెంబర్‌ 1 వరకూ ఈ పరిమాణం దాదాపు ఇదే స్థాయిలో కొనసాగుతోంది.  

2021 నవంబర్‌ 19 నుంచి 2022 మార్చి 25 వరకూ బ్యాంకుల్లో డిపాజిట్లు, రుణ వృద్ధి రూ. 5 లక్షల కోట్లమేర నమోదయితే, 2021–22 ఆర్థిక సంవత్సరంలో డిపాజిట్ల వృద్ధి దాదాపు 12 శాతంగా, రుణ వృద్ధి 8.5 శాతంగా ఉంటుంది.

మరిన్ని వార్తలు