ఏయే ఆదాయానికి ట్యాక్స్‌ మినహాయింపులిస్తారో..ఇవ్వరో మీకు తెలుసా!

18 Jul, 2022 08:41 IST|Sakshi

గత వారం ‘ఇతర ఆదాయాలు’ శీర్షిక కింద వచ్చే వివిధ అంశాలను తెలుసుకున్నాం. ఈవారం ఏయే ఆదాయానికి మినహాయింపులిస్తారో..వేటి విషయంలో మినహాయింపులివ్వరో తెలుసుకుందాం. 

డివిడెండు, వడ్డీని ఆదాయంగా లెక్కించినప్పుడు బ్యాంకరుకు ఇచ్చిన కమీషన్, పారితోషికం, ఇతర ఖర్చులు, వీటిని వసూలు చేయటానికి పెట్టిన ఖర్చులకు మినహాయింపులు ఇస్తారు. షరా మామూలుగానే ఖర్చు సమంజసంగా ఉండాలి. కాగితాలు, రుజువులు ఉండాలి. 

ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్‌ల మీద వచ్చే అద్దె/ఆదాయం విషయంలో.. చెల్లించిన అద్దెపరమైన పన్నులు, రిపేర్లు, ఇన్సూరెన్స్, తరుగుదల మొదలైనవి తగ్గిస్తారు. 

♦ చాలా మంది ఇంటద్దెని రెండు భాగాలుగా చేసి కొంత ఇంటి మీద అద్దె .. కొంత ఫర్నిచర్‌ మీద అద్దె అని ప్లానింగ్‌ చేస్తారు. ఇంటద్దె మీద ఏ కాగితాలు, వివరణ, సంజాయిషీ లేకుండా 30 శాతం స్టాండర్డ్‌ డిడక్షన్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఫర్నిచర్‌ అద్దెలో అంత వెసులుబాటు ఉండదు.  

 ఇతర ఆదాయం కింద పరిగణించేటప్పుడు దానిలో మినహాయింపులు రూ. 15,000 లేదా 1/3వ భాగం .. ఈ రెండింటిలో ఏది తక్కువయితే అదే ఇస్తారు. 

ఏ ఆదాయం ఉన్నా/వచ్చినా సంబంధిత ఖర్చుని మినహాయిస్తారు. వివరణ, రుజువులు కావాలి. 

♦ గుర్రాలను పోషిస్తూ, పోటీలు నిర్వహించే వారికి సంబంధిత ఖర్చులు మినహాయింపు ఇస్తారు. 

నష్టపరిహారం విషయంలో ఖర్చులుంటే క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

అలాగే కొన్ని ఆదాయాల లెక్కింపులో ఎటువంటి మినహాయింపులు ఇవ్వరు. 

వ్యక్తిగత ఖర్చులు 

క్యాపిటల్‌ ఖర్చులు .. ప్లాంటు, మెషినరీ, ఫర్నిచర్, బిల్డింగ్, మొదలైనవి. 

ఆస్తి పన్ను (మున్సిపల్‌ పన్ను కాదు) 

విదేశంలోని ఖర్చులు 

విదేశాల్లో ఉన్నవారికి ఇచ్చిన జీతాలు  

లాటరీలు, క్రాస్‌వర్డ్‌ పజిల్స్, రేసులు, గేమ్స్, బెట్టింగ్, జూదం మొదలైన వాటి మీద వచ్చే లాభాలను/పారితోషికం/ఆదాయం మొదలైన వాటిని ‘ఇతర ఆదాయం’ కింద వర్గీకరించి, ఆదాయంగా భావిస్తారు. అంతే కాకుండా ఎటువంటి ఖర్చులను మినహాయింపుగా ఇవ్వరు. 

చివరగా దృష్టిలో ఉంచుకోవాల్సినది ఏమిటంటే ఆదాయం విషయంలో సంబంధిత ఖర్చులు సమంజసంగా ఉన్నంత వరకు, వివరణ/రుజువులు/కాగితాలతో సమర్ధించుకోవాలి. పన్ను తగ్గించుకునే ప్రయత్నంలో తొందరపడొద్దు.   

మరిన్ని వార్తలు