లోన్స్‌కు డిమాండ్‌ రెట్టింపు!

2 Mar, 2021 00:39 IST|Sakshi

2021-22పై క్రిసిల్‌ నివేదిక

9 నుంచి 10 శాతం శ్రేణికి చేరుతుందని విశ్లేషణ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంచనా 4 నుంచి 5 శాతం

ముంబై: బ్యాంకింగ్‌లో రుణ డిమాండ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020–21) 4 నుంచి 5 శాతం ఉండగా, ఈ శ్రేణి వచ్చే ఆర్థిక సంవత్సరం (2021–22) దాదాపు రెట్టింపై 9 నుంచి 10 శాతానికి చేరుతుందని భారత్‌ గణాంకాల విశ్లేషణ, రీసెర్చ్‌ అండ్‌ రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ అంచనావేసింది. అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- స్టాండెర్డ్‌ అండ్‌ పూర్స్‌కు అనుబంధంగా పనిచేస్తున్న క్రిసిల్‌ తాజా నివేదికలో ముఖ్యాంశాలు చూస్తే...

  • కోవిడ్‌ ప్రేరిత సవాళ్ల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్ర ప్రభుత్వం సకాలంలో తీసుకున్న రెగ్యులేటరీ చర్యలు ఎకానమీ ఊహించిన దానికన్నా వేగంగా రికవరీ పట్టాలపైకి ఎక్కింది.
  • 2021-22లో భారత్‌ ఆర్థిక వ్యవస్థ 11 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకునే అవకాశం ఉంది.
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో బ్యాంకింగ్‌లో రుణ వృద్ధి రేటు 0.8 శాతం క్షీణించింది. అయితే మూడవ త్రైమాసికంలో 3 శాతం (నెలవారీగా చూస్తే) వృద్ధి నమోదయ్యింది. నాల్గవ త్రైమాసికంలో కూడా 3 శాతం వృద్ధి కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 0 నుంచి 1 శాతం శ్రేణిలో బ్యాంకింగ్‌ రుణ వృద్ధి ఉంటుందని గత ఏడాది జూన్‌లో క్రిసిల్‌ అంచనా వేయడం గమనార్హం. తాజా నివేదికలో ఈ అంచనాలను గణనీయంగా (4 నుంచి 5 శాతం శ్రేణిలో) మెరుగుపరచింది. కరోనా సవాళ్లను ఎదుర్కొనడానికి రూ.3 లక్షల కోట్ల విలువైన అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) వంటి ప్రభుత్వం ప్రకటిస్తున్న పలు ప్రోత్సాహకాలు రుణ డిమాండ్‌ పెరిగేందుకు దోహద పడుతుందని విశ్లేషించింది. ప్రైవేటు పెట్టుబడులు, ఎకానమీ రికవరీ వంటి అంశాలనూ ఇక్కడ ప్రస్తావించుకోవాల్సి ఉంటుంది.
  • ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో రుణాల విషయంలో అటు రుణ గ్రహీతలు, ఇటు రుణ దాతలు జాగరూకత వహించారు. అయితే లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపు పరిస్థితిని గణనీయంగా మార్చింది. పండుగల సీజన్‌ కూడా రుణ డిమాండ్‌కు గణనీయంగా దోహదపడింది.
  • వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ)కు ఎటువంటి సమస్యలూ తలెత్తకుండా రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నుంచి తగిన చర్యలు ఉంటున్నాయి.
  • బ్యాంకింగ్‌ మొత్తంగా రుణాల్లో కార్పొరేట్‌ క్రెడిట్‌ వాటా 49 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంలో ఈ విభాగం రుణ డిమాండ్‌లో క్షీణతే నెలకొనే అవకాశం ఉంది. మూలధన పెట్టుబడులకు కంపెనీలు వెనుకాడుతుండడమే దీనికి కారణం. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరం ఈ విభాగంలో 5 నుంచి 6 శాతం వృద్ధి రేటు నమోదయ్యే వీలుంది. తక్కువ స్థాయి బేస్‌తో పాటు, డిమాండ్‌ తిరిగి ఊపందుకోవడం దీనికి కారణం.
  • రిటైల్‌ రుణ మంజూరీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 9 నుంచి 10 శాతానికి తగ్గవచ్చు. వచ్చే ఆర్థిక సంవత్సరం తిరిగి ఈ విభాగం రెండంకెలకు పుంజుకుంటుంది. ఇక లఘు చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ)లకు సంబంధించి మొత్తం రుణ వృద్ధి 9 నుంచి 10 శాతం ఉండే వీలుంది. అయితే అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్‌) కొనసాగించని పక్షంలో ఎంఎస్‌ఎంఈలకు రుణ వృద్ధి 2021–22లో తిరిగి 8 నుంచి 9 శాతానికి తగ్గే అవకాశం ఉంది. కాగా, వ్యవసాయ రంగానికి వచ్చే, ప్రస్తుత, వచ్చే ఆర్థిక సంవత్సరాల్లో రుణ వృద్ధి రేటు 6 నుంచి 7 శాతం వరకూ ఉండే వీలుంది.
  • భారత్‌ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ ఉన్నాయి. తగిన వర్షపాతం లేకపోవడం, కరోనా కేసుల పెరుగుదల ఇందుకు కారణం. వ్యాక్సినేషన్‌ కార్యక్రమం విస్తృత స్థాయిలో జరగడం కూడా కీలకం.
  • రాష్ట్రాల ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తంగా 8.7 లక్షల కోట్లు లేదా వాటి స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తిలో 4.7 శాతానికి చేరుతుంది. ఈ అంచనాలు నిజమైతే ద్రవ్యలోటు గణాంకాల విషయంలో ఇదే చరిత్రాత్మక గరిష్ట స్థాయి అవుతుంది. కరోనా ప్రేరిత అంశాల వల్ల పన్ను వసూళ్లు పడిపోవడం తాజా అంచనాలకు ప్రధాన కారణం.
Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు