ఎంఎస్‌ఎంఈలకు రూ.లక్ష కోట్ల రుణాలు

21 Aug, 2020 05:07 IST|Sakshi

క్రెడిట్‌ గ్యారంటీ స్కీమ్‌ కింద పంపిణీ

న్యూఢిల్లీ: కరోనా కారణంగా ఏర్పడిన ప్రతికూల పరిస్థితులను అధిగమించేందుకు వీలుగా.. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్‌ఎంఈ)కు రూ.3 లక్షల కోట్ల రుణాలను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ‘అత్యవసర రుణ హామీ పథకం’ (ఈసీఎల్‌జీఎస్‌) కింద.. బ్యాంకులు ఇప్పటికే రూ.లక్షకోట్లకు పైగా రుణాలను అందించాయి. ఆగస్ట్‌ 18 నాటికి మొత్తం రూ.1,50,759.45  కోట్ల రుణాలను మంజూరు చేయగా, ఇందులో రూ.1,02,245.77 కోట్ల మేర వారికి పంపిణీ చేయడం కూడా పూర్తయింది. ఈ వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ గురువారం విడుదల చేసింది. ఈ పథకం కింద బ్యాంకులు ఎంఎస్‌ఎంఈలకు అందించే రుణాలకు కేంద్రం హామీదారుగా ఉంటుంది.

కరోనా వైరస్‌ వెలుగు చూసిన తర్వాత కేంద్రం ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల విలువైన వివిధ ప్యాకేజీల్లో ఈ పథకం కూడా ఒకటి కావడం గమనార్హం. 12 ప్రభుత్వరంగ బ్యాంకులు, 24 ప్రైవేటు బ్యాంకులు, 31 ఎన్‌బీఎఫ్‌ సీలు కలసి ఎంఎస్‌ఎంఈలకు ఈ మేరకు రుణాలను అందించాయి. కేంద్రం ప్రకటించిన నాటి నుంచి ఈ ఏడాది అక్టోబర్‌ చివరి వరకు లేదా గరిష్టంగా రూ.3 లక్షల కోట్ల రుణాలకు (ఏది ముందు అయితే అది) ఈ పథకం అమల్లో ఉంటుంది. రుణంపై 9.25 శాతం వార్షిక వడ్డీ రేటు అమలవుతుంది. అత్యధికంగా మహారాష్ట్రలోని ఎంఎస్‌ఎంఈలకు రూ.7,756 కోట్ల రుణాలు మంజూరు కాగా, ఆ తర్వాత తమిళనాడులోని ఎంఎస్‌ఎంఈలకు రూ.7,740 కోట్ల రుణాలు మంజూరయ్యాయి. 

మరిన్ని వార్తలు