యూట్యూబ్‌ వీడియోలు తెగ చూస్తున్నారు

19 Dec, 2020 08:26 IST|Sakshi

 సాక్షి,న్యూఢిల్లీ: యూట్యూబ్‌లో వీడియోల వీక్షణం భారత్‌లో అంతకంతకూ పెరుగుతోంది. వీక్షిస్తున్న సమయం క్రితం ఏడాదితో పోలిస్తే 2020 జూలైలో 45 శాతం పెరిగింది. ఆరు ప్రాంతీయ భాషలలో 2020 రెండవ భాగంలో యూట్యూబ్ ఇండియాలో అత్యధికంగా వీక్షించిన టాప్ 10 వాణిజ్య ప్రకటనల జాబితాలో చోటు దక్కించుకున్నట్లు ఆన్‌లైన్ వీడియో ప్లాట్‌ఫాం శుక్రవారం తెలిపింది.

తెలుగు, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ, కన్నడ లాంటి ప్రాంతీయ భాషల్లో కంటెంట్‌ ఉండడం కూడా ఈ వృద్ధిని నడిపించిన కారణాల్లో ఒకటని యూట్యూబ్‌ తెలిపింది. అందుబాటు ధరలో స్మార్ట్‌ఫోన్లు లభించడం, చవక డేటా టారిఫ్‌లతో కొన్నేళ్లుగా వీడియోలు ఎక్కువగా చూస్తున్నారని వివరించింది. మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్‌ కారణంగా ఓటీటీల వాడకం మరింతగా పెరిగిందని యూట్యూబ్‌ తెలిపింది. 2019 సెప్టెంబరులో విడుదలైన గూగుల్‌-కాంటార్‌ అధ్యయనం ప్రకారం 93 శాతం మంది ప్రాంతీయ భాషల్లో ఉన్న కంటెంట్‌ను చూసేందుకే మొగ్గు చూపుతున్నారు. యూట్యూబ్‌లో ప్రస్తుతం ఆరు ప్రాంతీయ భాషల్లో ప్రకటనలు వెలువడుతున్నాయి.   

మరిన్ని వార్తలు