లాజిస్టిక్స్‌కు సానుకూలం..

8 Apr, 2022 06:40 IST|Sakshi

2022–23లో 7–9 శాతం మేర వృద్ధి

కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి

రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా

ముంబై: లాజిస్టిక్స్‌ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 7–9 శాతం మేర వృద్ధిని చూస్తుందని రేటింగ్‌ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. అయితే చమురు, కమోడిటీల ధరలు పెరుగుతున్న దృష్ట్యా ఈ రంగంలోని కంపెనీల మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని పేర్కొంది. లాజిస్టిక్స్‌ రంగంపై ఒక నివేదికను ఇక్రా గురువారం విడుదల చేసింది. 2021–22లో ఈ రంగంలో వృద్ధి కరోనా ముందు నాటితో పోలిస్తే 14–17 శాతం అధికంగా ఉంటుందని తెలిపింది.

మధ్య కాలానికి ఆదాయంలో వృద్ధి అన్నది ఈ కామర్స్, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్, కెమికల్స్, ఫార్మాస్యూటికల్స్, ఇండస్ట్రియల్‌ గూడ్స్‌ నుంచి వస్తుందని పేర్కొంది. జీఎస్‌టీ, ఈవేబిల్లు అమలు తర్వాత లాజిస్టిక్స్‌ సేవల్లో సంస్థాగత వాటా పెరుగుతున్నట్టు వివరించింది. బహుళ సేవలను ఆఫర్‌ చేస్తుండడం కూడా ఆదరణ పెరగడానికి కారణంగా పేర్కొంది. పైగా ఈ రంగంలోని చిన్న సంస్థలతో పోలిస్తే పెద్ద సంస్థలకు ఉన్న ఆర్థిక సౌలభ్యం దృష్ట్యా, వాటికి ఆదరణ పెరుగుతోందని.. ఈ రంగంలో రానున్న రోజుల్లో మరింత వ్యాపారం సంస్థాగతం వైపు మళ్లుతుందని అంచనా వేస్తున్నట్టు తెలిపింది.  

క్రమంగా పెరుగుతున్న డిమాండ్‌
కొన్ని నెలలుగా రవాణా కార్యకలాపాలు పుంజుకుంటున్నట్టు ఇక్రా తెలిపింది. పలు రంగాల్లో డిమాండ్‌ పుంజుకోవడం ఇందుకు మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. కరోనా మూడో విడత వేగంగా సమసిపోవడంతో ఆంక్షలను ఎత్తేయడం కలిసి వచ్చినట్టు వివరించింది. కమోడిటీల ధరలు పెరిగిపోవడం, రవాణా చార్జీలన్నవి స్వల్పకాలంలో సమస్యలుగా ప్రస్తావించింది. వినియోగ డిమాండ్‌పై మార్జిన్లు ఆధారపడి ఉంటాయని అంచనా వేసింది. ‘‘త్రైమాసికం వారీగా లాజిస్టిక్స్‌ రంగం ఆదాయం 2021–22 రెండో త్రైమాసికంలో (జూలై–సెప్టెంబర్‌) బహుళ సంవత్సరాల గరిష్ట స్థాయికి వెళ్లింది. పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకోవడం కలిసొచ్చింది’’అని ఇక్రా తన నివేదికలో తెలిపింది. 2022 జనవరి–ఫిబ్రవరి నెలల్లో ఈవే బిల్లుల పరిమాణం, ఫాస్టాగ్‌ వసూళ్లలో స్థిరత్వం ఉన్నట్టు ఇక్రా నివేదిక వివరించింది.   

మరిన్ని వార్తలు