విజయ్‌మాల్యాకు భారీ షాక్‌! లండన్‌ నివాసం నుంచి గెట్‌ అవుట్‌ ?

19 Jan, 2022 08:29 IST|Sakshi

London High Court Verdict Vijay Mallya: ఒకప్పుడు కింగ్‌ ఆఫ్‌ గుడ్‌ టైమ్స్‌గా వార్తల్లో నిలుస్తూ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన వ్యాపారవేత్త, లిక్కర్‌ కింగ్‌ విజయ్‌మాల్యా జీవితంలో అత్యంత గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాడు. బ్యాంకులకు అప్పులు ఎగవేసిన కేసులో ఆయనకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. దీంతో లండన్‌లో ప్రస్తుతం మాల్యాకి నిలువ నీడ లేకుండా పోయింది. 

ఇళ్లు ఖాళీ చేయండి
స్విట్జర్లాండ్‌కు చెందిన యూబీఎస్‌కు 20.4 మిలియన్‌ బ్రిటన్‌ పౌండ్ల చెల్లింపుల రికవరీ కేసుకి సంబంధించి లండన్‌ హై కోర్టులో కేసు నడుస్తోంది. ఇప్పటికే పలు మార్లు ఈ కేసు వాయిదాలు పడుతూ వస్తుండగా తాజాగా కోర్టు తీర్పు వెలువరించింది. లండన్‌లోని రిజెంట్‌ పార్క్‌లో ఉన్న కార్న్‌వాల్‌ టెర్రస్‌ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ని అప్పు కింద జమ చేసుకోవచ్చంటూ యూబీఎస్‌ బ్యాంకికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు విజయ్‌ మాల్యా స్వచ్ఛందంగా ఇంటిని ఖాళీ చేయాలని లేదంటూ న్యాయాధికారుల సమక్షంలో ఖాళీ చేయించాల్సి ఉంటుందంటూ హెచ్చరించింది. లండన్‌ హై కోర్టు తీర్పుతో ఏన్నాళ్లుగానో విజయ్‌మాల్యా తాను నివసిస్తున్న ఇంటిని వదిలి వెళ్లాల్సి వస్తోంది.

అప్పీల్‌కి అవకాశం లేదు
లండన్‌ ఇంటిని కాపాడుకునేందుకు విజయ్‌ మాల్యా విశ్వ ప్రయత్నం చేశారు. ఇప్పటికే పలు మార్లు ఈ కేసుపై వాయిదాలు కోరుతూ వచ్చారు.  వేరే బెంచ్‌కి మార్చేందుకు ప్రయత్నించారు. అయితే తాజా తీర్పులో న్యాయమూర్తి వీటన్నింటీని ప్రస్తావిస్తూ తీర్పు ఇచ్చారు. ‘ఇప్పటికే అప్పులు తీర్చేందుకు విజయమాల్యాకు అనేక అవకాశాలు ఇచ్చాం.. సరిపడ సమయం కల్పించాం.. ఐనప్పటికీ అప్పులు చెల్లించడంలో ఆయన విఫలమయ్యారు. ఈ కేసు పూర్వపరాలను పరిశీలించిన తర్వాత ఏ న్యాయమూర్తి అయినా తనకంటే భిన్నంగా తీర్పు ఇవ్వరు. కాబట్టి మళ్లీ అప్పీల్‌ చేసుకోవడం కూడా వృధా అంటూ’ అప్పీల్‌ను సైతం న్యాయమూర్తి నిరాకరించారు.

చివరి ప్రయత్నం
లండన్‌లో ప్రస్తుతం మాల్యా నివసిస్తున్న లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో అతని కొడుకు సిద్ధార్థ్‌మాల్యా (34)తో పాటు విజయ్‌ మాల్యా తల్లి లలితా మాల్యా కూడా ఉన్నారు. ఆమె వయస్సు ఇప్పుడు 95 ఏళ్లు. ఈ వయస్సులో ఇప్పటికిప్పుడు ఉంటున్న ఇంటిని ఖాళీ చేయడం ఆమె మానసిక, శారీరక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని... కనీసం మానవతా దృక్పథంతో విజయ్‌మాల్యా తల్లి వయస్సుని పరిగణలోకి తీసుకునైనా తీర్పు ఇవ్వాలంటూ మాల్యా తరఫున న్యాయవాదులు కోరారు. కానీ విజయ్‌ మాల్యాకి ఊరట లభించలేదు. 

వాళ్లు ఊరుకోలేదు
భారత్‌ బ్యాంకులను కోట్లాది రూపాయల మేర మోసం చేసి, బ్రిటన్‌కు విజయ్‌మాల్యా పారిపోయారు. రుణాలు ఇచ్చిన బ్యాంకులన్నీ కన్సార్టియంగా ఏర్పడి ఎస్‌బీఐ నేతృత్వంలో న్యాయ పోరాటం చేస్తున్నాయి. ఇప్పటికే మాల్యాకు సంబంధించిన పలు ఆస్తులు అమ్మకానికి వచ్చాయి. ఇందులో చాలా వరకు మాల్యా పెద్దగా ఉపయోగించని ఫార్మ్‌హౌస్‌లు, లగ్జరీ యాచ్‌లే ఉన్నాయి.  కానీ స్విట్జర్లాండ్‌ బ్యాంకు రుణాల రికవరీలో భాగంగా విజయ్‌మాల్యా నివసించే ఇంటినే లాగేసింది. ఉన్నపళంగా ఆయన రోడ్డు మీదకు నెట్టేసింది. 

చదవండి: అమ్మకానికి విజయ్‌మాల్యా విల్లా.. వేలంలో దక్కించుకున్న హైదరాబాద్‌ సంస్థ

అక్కడే ఉంటారేమో
విజయ్‌మాల్యా హవా నడిచినప్పుడు అందమైన మోడళ్లతో బీచ్‌లలో లగ్జరీ యాచ్‌లలో గడిపేవారు, వేలం పాటలో ఖరీదైన, యాంటిక్‌ వస్తువులను దక్కించుకున్నారు. ఫార్ములా వన్‌ టీమ్‌ని కొనుగోలు చేశారు. తన ఫార్ములా వన్‌ టీమ్‌ ఏస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ కుటుంబానికి సంబంధించిన రెండు ఇళ్లను విజయ్‌మాల్యా ఆ రోజుల్లో కొనుగోలు చేశారు. అవి ఇంగ్లండ్‌లోని టెవిన్‌, హెర్డ్‌ఫోర్‌షైర్‌లో ఉన్నాయి. ప్రస్తుతం విజయ్‌మాల్యా తన మకాం ఇక్కడికే మార్చే అవకాశం ఉంది.

చేతులెత్తిసినట్టేనా ?
వేల కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా గడిచిన ఐదేళ్లుగా అనేక కోర్టుల్లో న్యాయపోరాటం చేస్తున్నారు. కేవలం లాయర్ల ఫీజులు చెల్లించేందుకు ఆయన ఆస్తులు అమ్ముకున్న సందర్భాలు ఉన్నాయి. ఎప్పుడైనా మీడియా కంట పడిన ఆయన గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే వచ్చారు. కాగా లండన్‌ ఇంటిని కాపాడుకోలేకపోవడం విజయ్‌మాల్యాకి గట్టి ఎదురు దెబ్బగానే చెప్పుకోవచ్చు. ముందు ముందు  న్యాయస్థానాల్లో ఆయన పోరాటం ఎంత వరకు కొనసాగుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.  
 

చదవండి: Vijay Mallya : రోజులు ఎప్పుడూ ఒక్కలా ఉండవు !

మరిన్ని వార్తలు