టెస్లా ఎలక్ట్రిక్‌ కారుకి ఇండియాలో అడ్డం పడుతున్న ‘స్పీడ్‌ బ్రేకర్‌’

23 Sep, 2021 15:40 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ కార్లను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఇండియాలో ఎలక్ట్రిక్‌ కారుని ప్రవేశపెట్టేందుకు టెస్లా తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. ఈ మేరకు టెస్లా, ఇండియా ప్రభుత్వాల మధ్య చర్చలు జరుగుతుండగా కొత్త సమస్య తెర మీదకు వచ్చింది. 

ఎస్‌ ప్లెయిడ్‌
టెస్లా లేటెస్ట్ మోడల్‌ ఎస్‌ ప్లెయిడ్‌. కేవలం రెండు సెకన్లలోనే 60 మైళ్ల స్పీడు అందుకోవడం ఈ కారు ప్రత్యేకత. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే 200 మైళ్ల దూరం ప్రయాణం చేయవచ్చు. సెడాన్‌ మోడలైన పవర్‌లో ఎస్‌యూవీకి ఏమాత్రం తీసిపోదు. ఇండియాలో ఎస్‌ ప్లెయిడ్‌ మోడల్‌నే టెస్లా ప్రవేశపెట్టే యోచనలో ఉంది.

గ్రౌండ్‌ క్లియరెన్స్‌
టెస్లా ఎస్‌ ప్లెయిడ్‌ కారు పూర్తిగా అమెరికా రోడ్లకు అనుగుణంగా రూపొందింది. ఈ సెడాన్‌ ఈవీ గ్రౌండ్‌ క్లియరెన్స్‌ కేవలం 25 మిల్లీమీటర్లు మాత్రమే. కానీ ఇండియన్‌ రోడ్లపై స్మూత్‌గా జర్నీ చేయాలంటే కనీసం 140 మిల్లీ మీటర్ల గ్రౌండ్‌ క్లియరన్స్‌ ఉండాలి. లేదంటే బంపీ రోడ్లు, స్పీడ్‌ బ్రేకర్లు వచ్చినప్పడు కారు బాడీ నేలను తాకే అవకాశం ఉంటుంది. 

ఎస్‌ ప్లెయిడ్‌ కష్టమే
ఇండియన్‌ మార్కెట్‌లో టెస్లా కారు ఎలా దూసుకుపోతుందనే విషయానికి సంబంధించి ఇటీవల కంపెనీ తరఫున నిర్వహించిన టెస్ట్‌ డ్రైవ్‌లో గ్రౌండ్‌ క్లియరెన్స్‌ సమస్య ఎదురైనట్టు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఆగాల్సిందేనా
ఎస్‌ప్లెయిడ్‌ కారునే ఇండియాలో ప్రవేశపెట్టాలని టెస్లా భావిస్తే కచ్చితంగా కారు డిజైన్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది. గ్రౌండ్‌ క్లియరెన్సుని ఇక్కడికి తగ్గట్టుగా 25 మిల్లీమీటర్ల నుంచి 165 మిల్లీమీటర్ల వరకు పెంచాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే ఏడాది రిలీజ్‌ చేయనున్న టెస్లా వై మోడల్‌ వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే అని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. 

చదవండి : టెస్లా ఎలక్ట్రిక్‌ కారు.. 18 లక్షలకే! అదీ స్టీరింగ్‌ లేకుండానా?

>
మరిన్ని వార్తలు