CRISIL: ఎకానమీ రికవరీపై తాజా నివేదిక

27 Aug, 2021 08:27 IST|Sakshi

ముంబై: కోవిడ్‌–19 ప్రతికూలతలతో తీవ్ర కష్టాల్లోకి వెళ్లిపోయి, రుణ పునర్‌ వ్యవస్థీకరణ తప్పదని భావించిన పలు కంపెనీలు ప్రస్తుతం తమ ధోరణిని మార్చుకుంటున్నాయని దేశీయ రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ తన తాజా నివేదికలో పేర్కొంటున్నాయి.అదే సమయంలో మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు చెప్పినట్లు తెలుస్తోంది. 

నివేదిక ప్రకారం ఎకానమీలో రికవరీ జాడలు కనిపించడమే దీనికి కారణం. దీనితో ఆయా కంపెనీలపై వృద్ధి ధోరణిపై భరోసా ఏర్పడింది. దీనితో రుణ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ప్రకటించిన రిజల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0కు కేవలం కొన్ని కంపెనీలే ముందుకు వస్తున్నాయి. తాను రేటింగ్‌ ఇచ్చిన 4,700 కంపెనీల్లో కేవలం ఒక శాతం అర్హత కలిగిన (రుణ పునర్‌వ్యవస్థీకరణకు) కంపెనీలు మాత్రమే రిజల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0ను ఎంచుకున్నట్లు క్రిసిల్‌ రేటింగ్స్‌ చీఫ్‌ రేటింగ్స్‌ ఆఫీసర్‌ సుభోద్‌ రాయ్‌ నివేదికలో వివరించారు.

మొదటి వేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో వ్యాపార నష్టం అంతగా జరగలేదని పలు కంపెనీల ప్రతినిధులు పేర్కొన్నట్లు ఆయన తెలిపారు. 2021 మే 5వ తేదీన ఆర్‌బీఐ రుణ పునర్‌వ్యవస్థీకరణకు సంబంధించి వ్యక్తులు, చిన్న వ్యాపారులు, లఘు, మధ్య చిన్న తరహా పరిశ్రమల రుణ గ్రహీతలకు రిజల్యూషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ 2.0ను ప్రకటించింది. పునర్‌వ్యవస్థీకరణ పరిమితిని రూ.25 కోట్లుగా నిర్ణయించింది. 2021 మార్చి 31న ప్రకటించిన తొలి ఫ్రేమ్‌వర్క్‌ను వినియోగించుకోని వారికి ఇది వర్తిస్తుందని తెలిపింది. అయితే జూన్‌ 4న రుణ పరిమితిని రూ.50 కోట్లకు పెంచింది. క్రిసిల్‌ రేటింగ్‌ ఇస్తున్న సంస్థల్లో 66 శాతం కంపెనీలు ఈ పరిధిలో ఉన్నాయి. అయితే అయితే కేవలం ఒకశాతం మాత్రమే పునర్‌వ్యవస్థీకరణను ఎంచుకుంటున్నల్లు క్రిసిల్‌ వివరించింది. వ్యాపార అవుట్‌లుక్‌ బాగుండడమే దీనికి కారణం. అయితే మూడవ వేవ్‌ వస్తే మాత్రం రుణ పునర్‌వ్యవస్థీకరణ 2.0ను ఎంచుకునే కంపెనీల సంఖ్య పెరుగుగుతుందని భావిస్తున్నట్లు క్రిసిల్‌ నివేదిక అభిప్రాయపడింది.  

చదవండి : జూలైలో జాబ్స్‌ పెరిగాయ్..రానున్న రోజుల్లో..!

మరిన్ని వార్తలు