ఎల్‌అండ్‌టీకి కోవిడ్‌ దెబ్బ

29 Oct, 2020 05:24 IST|Sakshi

క్యూ2లో 45 శాతం డౌన్‌; రూ.1,410 కోట్లు

తీవ్ర ప్రభావం చూపిన కోవిడ్‌–19

న్యూఢిల్లీ: ఇంజినీరింగ్, నిర్మాణ రంగ దిగ్గజం లార్సెన్‌ అండ్‌ టూబ్రో (ఎల్‌అండ్‌టీ)కు కోవిడ్‌–19 ప్రభావం తీవ్రంగానే తాకింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (2020–21, క్యూ2)లో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) రూ.1,410 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.2,552 కోట్లతో పోలిస్తే 45 శాతం క్షీణించింది. మొత్తం ఆదాయం సైతం రూ.35,925 కోట్ల నుంచి రూ.31,594 కోట్లకు దిగజారింది. 12 శాతం తగ్గిపోయింది. కాగా, వ్యాపార పరిస్థితులు పుంజుకుంటుండటంతో ఈ ఏడాది తొలి త్రైమాసికంతో పోలిస్తే (సీక్వెన్షియల్‌గా) లాభం సుమారు 4 రెట్లు మెరుగుపడినట్లు కంపెనీ వెల్లడించింది.

‘కరోనా మహమ్మారి ప్రభావంతో ఆదాయం పడిపోయింది. ఆర్థిక సేవల వ్యాపారంలో అధిక క్రెడిట్‌ ప్రొవిజన్‌లు మెట్రో సేవలకు అంతరాయం కారణంగా లాభంలో 45 శాతం క్షీణతకు దారితీసింది’ అని కంపెనీ పేర్కొంది. కాగా, మొత్తం వ్యయాలు సైతం రూ.32,622 కోట్ల నుంచి రూ.29,456 కోట్లకు పడిపోయాయి. అంతర్జాతీయ కార్యకలాపాల ఆదాయం రూ.12,148 కోట్లుగా నమోదైంది. క్యూ2(జూలై–సెప్టెంబర్‌)లో కంపెనీ తన ఎలక్ట్రికల్, ఆటోమేషన్‌ (ఈఅండ్‌ఏ) వ్యాపారాన్ని ఫ్రాన్స్‌కు చెందిన ష్నిడర్‌ ఎలక్ట్రిక్‌ (ఎస్‌ఈ)కు విక్రయించింది.  క్యూ2లో గ్రూపు స్థాయిలో ఎల్‌అండ్‌టీ రూ.28,039 కోట్ల కాంట్రాక్టులను చేజిక్కించుకుంది. క్రితం ఏడాది ఇదే క్వార్టర్‌తో పోలిస్తే  42% తగ్గాయి.
ఫలితాల నేపథ్యంలో ఎల్‌అండ్‌టీ షేరు బుధవారం బీఎస్‌ఈలో 0.12% లాభంతో రూ.984 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు