పర్యాటకానికి పెళ్లి కళ

13 Mar, 2021 00:22 IST|Sakshi

దేశీయ పర్యాటక ప్రాంతాల వైపు సంపన్నుల చూపు 

విదేశీ ప్రయాణాలపై ఆంక్షలే కారణం

జోధ్‌పూర్, జైపూర్, ముస్సోరి ప్రాంతాలకు డిమాండ్

న్యూఢిల్లీ: దేశంలో ఖరీదైన వివాహ వేడుకల సందడి మళ్లీ మొదలైంది. కరోనా కారణంగా గతేడాది చాలా వివాహాలకు బ్రేక్‌ పడింది. అయితే, తమ వివాహాలను ‘అద్భుతం.. అనిర్వచనీయం’ అనే తీరున నిర్వహించుకోవాలన్న ఆకాంక్షలతో ఉన్న వారు ఈ ఏడాది అందుకు సరైన ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇటలీలో చారిత్రకంగా ప్రసిద్ధిగాంచిన టుస్కానీలో విరాట్‌ కోహ్లీ–అనుష్క శర్మల వివాహం.. ఇటలీలోనే మరో చిన్న పట్టణం ‘కోమో’లో జరిగిన దీపికా పదుకొణె–రణవీర్‌సింగ్‌ల వివాహ వేడుకలు గుర్తుండే ఉంటాయి. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలతో.. ఈ తరహా ఘనమైన వివాహాలకు దేశీయంగా ప్రఖ్యాతిగాంచిన ప్రదేశాలు ఇప్పుడు రద్దీగా మారుతున్నాయి.

దేశంలో వివాహ గమ్యస్థానాలుగా (డెస్టినేషన్‌ వెడ్డింగ్‌) పేరొందిన జైపూర్, జోధ్‌పూర్, ముస్సోరీ ప్రాంతా ల్లోని అల్ట్రా లగ్జరీ హోటళ్లకు ఇప్పుడు భారీ డిమాండ్‌ నెలకొంది. గతేడాది కరోనా కారణంగా చాలా మంది తమ వివాహాలను వాయిదా వేసుకున్నారు. ఈ ఏడాది అయినా పెళ్లి పీటలు ఎక్కుదామనుకుంటే.. కరోనా మళ్లీ క్రమంగా విస్తరిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీయ విమాన సర్వీసులపై కేంద్ర ప్రభుత్వం పరిమిత కాలపు నిషేధం విధించడం వారిని ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించేలా చేసింది. దీంతో ‘ఆగడం ఇక మా వల్ల కాదు’ అని భావించే వారు.. దేశీయంగానే మనసులను కట్టిపడేసే ప్రదేశాల వైపు చూస్తున్నారు. దీంతో ఖరీదైన వివాహ వేడుకులకు పేరొందిన.. తాజ్, ఒబెరాయ్, ఐటీసీ, లీలా, మారియట్, యాకోర్‌ ఇవన్నీ కూడా ఇప్పుడు బుకింగ్‌లకు మంచి డిమాండ్‌ను చూస్తున్నాయి. 

రణబీర్‌ కపూర్‌ వివాహం ఎక్కడ?  
‘‘ఖరీదైన భారతీయ వివాహ వేడుకలు ఇప్పుడు కొంచెం పలుచన అయ్యాయేమో (తగ్గడం) కానీ.. గతంతో పోలిస్తే మరింత భారతీయతను సంతరించుకుంటున్నాయి’’ అని తాజ్‌ హోటల్స్‌ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌లకు పేరొందిన ప్రముఖ హోటళ్ల జనరల్‌ మేనేజర్‌ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ.. ‘‘ఉదయ్‌పూర్‌లో కలల వివాహాలకు పేర్కొందిన ఉదయ్‌ విలాస్‌లో జరిగిన స్నేహితుని వివాహ వేడుకకు రణబీర్‌కపూర్‌ గతంలో విచ్చేశారు. కానీ, ఇప్పుడు హోటళ్ల ప్రతినిధుల మధ్య ఆసక్తికరమైన చర్చ ఏమిటంటే.. అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు ఉన్నందున.. రణబీర్‌ కపూర్‌ వివాహానికి ఏ హోటల్‌ వేదిక కానుందనే’’ అని పేర్కొన్నారు.

డిమాండ్‌ పెరిగినప్పటికీ హోటళ్ల యాజమాన్యాలు పూర్తి జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా నివారణకు సంబంధించి అన్ని నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నాయి. గరిష్టంగా అతిథుల ఆహ్వానంలో పరిమితులు, అతిధుల మధ్య భౌతిక దూరం తదితర చర్యలు తీసుకుంటున్నాయి. ‘‘యే జవానీ హాయ్‌దివానీ తరహా వివాహాలను ఖరీదైన ప్రదేశాల్లో చేసుకోవాలంటే.. అది కనీసం రెండు మూడు రోజుల కార్యక్రమమే అవుతుంది. సంగీత్, మెహెంది, హాల్ది, చివరగా వివాహ వేడుక ఇలా కార్యక్రమాలు ఉంటాయి. మొత్తం ఖర్చు.. బస, భోజనాలు, పానీయాలు, వినోదం, ఇతర కార్యక్రమాలకు ఎంతలేదన్నా కనీసం కోటి నుంచి కోటిన్నర రూపాయల ఖర్చు ఉంటుంది’’ అని ప్రముఖ హోటల్‌ ప్రతినిధి పేర్కొన్నారు.  

డిమాండ్‌తో పెరుగుతున్న చార్జీలు.. 
‘‘మా హోటళ్లలో పరిమిత అతిధులతో కూడిన వివాహాలకూ డిమాండ్‌ నెలకొంది. పట్టణ ప్రాంతాల్లోనూ చక్కని బుకింగ్‌లు నమోదవుతున్నాయి. ఈ విభాగంలో తిరిగి డిమాండ్‌ బలపడుతోంది’’ అని తాజ్‌ హోటల్స్‌ అధికార ప్రతినిధి తెలిపారు. చాలా హోటళ్లు 2019 సంవత్సరం టారిఫ్‌లను 2021 మొదటి మూడు నెలల్లో జరిగిన వివాహ వేడుకలకు వసూలు చేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌–సెప్టెంబర్‌ కాలంలోని వివాహాల బుకింగ్‌లపై 2019లో వసూలు చేసిన చార్జీల కంటే 10–15 శాతం అధికంగానే చార్జ్‌ చేయడం జరుగుతోంది. ఇక 2021 అక్టోబర్‌–డిసెంబర్‌ కాలంలోని పెళ్లిళ్ల బుకింగ్‌లపై చార్జీలు ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోని చార్జీల కంటే 20 శాతం అధికంగా ఉండనున్నాయి’’ అని జైపూర్‌లోని ఫెయిర్‌మాంట్‌ జనరల్‌మేనేజర్‌ రాజీవ్‌ కపూర్‌ చెప్పారు.    

మరిన్ని వార్తలు