రెండేళ్లలో బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా మాజా

8 Nov, 2022 08:12 IST|Sakshi

న్యూఢిల్లీ: వచ్చే రెండేళ్లలో తమ పోర్ట్‌ఫోలియోలోని మాజా సాఫ్ట్‌ డ్రింక్‌ కూడా బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌గా ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్లు కోకా–కోలా ప్రెసిడెంట్‌ (భారత్, ఆగ్నేయాసియా) సంకేత్‌ రే తెలిపారు. వాస్తవానికి 2023లోనే ఈ మైలురాయి సాధించవచ్చని ముందుగా భావించినప్పటికీ ప్రతికూల వాతావరణ పరిస్థితులు, మామిడి గుజ్జు ధరలు పెరిగిపోవడం మొదలైన అంశాల వల్ల కుదరలేదని పేర్కొన్నారు. 

వచ్చే ఏడాది ఏ విధంగా ఉంటుందో ముందుగా అంచనా వేయలేమని, అయితే 2024 నాటికి మాత్రం తమ లక్ష్యాన్ని తప్పకుండా సాధించే అవకాశాలు ఉన్నాయని రే వివరించారు. కంపెనీకి చెందిన థమ్స్‌ అప్, స్ప్రైట్‌ సాఫ్ట్‌ డ్రింకులు ఈ ఏడాదే బిలియన్‌ డాలర్‌ బ్రాండ్‌లుగా ఎదిగిన నేపథ్యంలో అల్ఫాన్సో రకం మామిడి గుజ్జు నుండి తయారు చేసే మాజా కూడా సదరు మైలురాయిని దాటితే పోర్ట్‌ఫోలియోలో మూడోది అవుతుంది.  

ఆ రెండింటి ఎంట్రీ మంచిదే.. 
రిలయన్స్‌ రిటైల్, టాటా కన్జూమర్‌ ప్రోడక్ట్స్‌ (టీసీపీఎల్‌) వంటి దిగ్గజాలు కూడా శీతల పానీయాల విభాగంలోకి ప్రవేశిస్తుండటంపై స్పందిస్తూ.. ఇది సానుకూల పరిణామమేనని రే అభిప్రాయపడ్డారు. మార్కెట్‌ మరింతగా పెరుగుతుందని, అంతిమంగా వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరగలదని ఆయన పేర్కొన్నారు.

అయితే, రెండింటి ఎంట్రీతో ధరపరంగా పెద్ద పోటీ లేకపోయినప్పటికీ,  స్థానిక స్థాయిలో కొన్ని పెను మార్పులు చోటు చేసుకుని కన్సాలిడేషన్‌కు దారి తీయొచ్చని రే వివరించారు. శీతల పానీయాల మార్కెట్లోకి ప్రవేశించే ఉద్దేశంతో రిలయన్స్‌ రిటైల్‌ ఇటీవలే దేశీ బ్రాండ్‌ కాంపా కోలాను కొనుగోలు చేయగా, టీసీపీఎల్‌ క్రమంగా బెవరేజెస్‌ మార్కెట్లో విస్తరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న కోకా–కోలాకు భారత్‌ అయిదో అతి పెద్ద మార్కెట్‌గా ఉంది. 

మరిన్ని వార్తలు