మెర్సిడెజ్‌ బెంజ్‌.. మేడిన్‌ ఇండియా.. ధర ఎంతంటే?

7 Oct, 2021 16:07 IST|Sakshi

Made-in-India Mercedes-Benz S-Class: లగ్జరీ కార్ల విభాగంలో మోస్ట్‌ పాపులర్‌ మోడల్‌ మెర్సిడెజ్‌ బెంజ్‌ సెడాన్‌ ధరలు భారీగా తగ్గాయి. విదేశాల నుంచి దిగుమతికి బదులుగా ఇక్కడే కార్లను తయారు చేస్తుండటంతో వాటి కార్ల ధరల్లో తగ్గుదల సాధ్యమైంది. ఇండియాలో తయారైన కార్లను 2021 అక్టోబరు 7న ఆ సంస్థ మార్కెట్‌లోకి రిలీజ్‌ చేసింది.

సక్సెస్‌ మోడల్‌
మెర్సిడెజ్‌ బెంజ్‌ కార్లకు ఆది నుంచి ఇండియాలో డిమాండ్‌ ఉంది. సంపన్న వర్గాలు సెడాన్‌ సెగ్మెంట్‌లో బెంజ్‌ కారుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. ఇటీవల మెర్సిడెజ్‌ బెంజ్‌ రిలీజ్‌ చేసిన ఎస్‌ క్లాస్‌ కార్లకు మంచి ఆదరణ లభించింది. దీంతో ఇండియన్లకు మరింత చేరువయ్యేలా చర్యలు ప్రారంభించింది జర్మనీకి చెందిన మెర్సిడెజ్‌ బెంజ్‌.

తగ్గిన ధర
ఎక్స్‌ షోరూమ్‌కి సంబంధించి గతంలో మెర్సిడెజ్‌ బెంజ్‌ ఎస్‌ ధర రూ. 2.17 కోట్లు ఉండగా ఎస్‌ క్లాస్‌ 450 4 మ్యాటిక్‌ ధర రూ. 2.19 కోట్ల రూపాయలుగా ఉండేది. తాజాగా ఈ కార్ల ధరలు తగ్గిపోయాయి. ఎస్‌ క్లాస్‌  450 4 మ్యాటిక్‌ ప్రారంభ ధర రూ. 1.62 కోట్లకు తగ్గిపోయింది. మరో మోడల్‌ ఎస్‌ క్లాస్‌ 350 డీ ధర రూ. 1.57 కోట్లకు తగ్గింది.

కారణం
గతంలో జర్మనీలో పూర్తిగా తయారైన కార్లనే (కంప్లీట్‌ బల్డిండ్‌ యూనిట్‌) ఇండియకు దిగుమతి చేసుకుని ఇక్కడ అమ్మకాలు జరిపే వారు, దీంతో దిగుమతి సుంకం భారం వినియోగదారులపై పడేది. తాజాగా బెంజ్‌ సంస్థ విడిభాగాలను ఇండియాకు తెప్పించి ఇక్కడే కార్లను (కంప్లీట్‌ నాక్‌అవుట్‌ యూనిట్‌) తయారు చేస్తోంది. దీంతో దిగుమతి సుంకం భారం లేకుండా పోయింది. ఫలితంగా ధరలు తగ్గాయి.

అదే క్వాలిటీ
జర్మీలో తయారు చేసినా ఇండియాలో కార్లను రూపొందించినా.. తమదైన నాణ్యతా ప్రమాణాలకు కచ్చితంగా పాటిస్తామని బెంజ్‌ సంస్థ అంటోంది. ప్రపంచ శ్రేణి కార్ల తరహాలోనే ఇండియన్‌ మేడ్‌ కార్లు కూడా ఉన్నాయని వెల్లడించింది. 

చదవండి : బుకింగ్‌లో మహీంద్రా ఎక్స్‌యువి 700 ఎస్‌యూ‌వి సరికొత్త రికార్డు

మరిన్ని వార్తలు