టెస్లా కంపెనీ కోసం పోటీపడుతున్న రాష్ట్రాలు.. తెలంగాణ తర్వాత మరో రాష్ట్రం ఆఫర్!

16 Jan, 2022 16:34 IST|Sakshi

ప్రముఖ అంతర్జాతీయ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ 'టెస్లా' ఈ ఏడాది భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉన్న సంగతి మనకు తెలిసిందే. అయితే, ఎలక్ట్రిక్ కార్ల కంపెనీని తమ రాష్ట్రంలో అంటే..తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పుడు పోటీపడుతున్నాయి. ఇదంతా ఇటీవల ఒక ట్విటర్ వినియోగదారుడు ఎలన్‌మస్క్‌ను అడిగిన ఒక ప్రశ్నతో మొదలైంది. మన దేశంలో టెస్లా కార్లను ఎప్పుడూ లాంచ్ చేస్తారు అని ట్విటర్ ఖాతాదారుడు అడిగిన ప్రశ్నకు మస్క్ సమాధానం ఇస్తూ.. "ఇండియాలో కార్లను విడుదల చేయడానికి ఇప్పటికీ ప్రభుత్వంతో చాలా సవాళ్లను ఎదుర్కొంటున్నట్లు" అని ట్వీట్ చేశారు.

ఆ ట్వీట్‌ను నిన్న(జనవరి 15) కేటీఆర్‌ రీట్వీట్‌ చేస్తూ.."ఇండియాకి టెస్లా కనుక వస్తే.. మీతో కలిసి పని చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ తెలంగాణ రాష్ట్ర ఇండస్ట్రీస్‌, కామర్స్‌ మంత్రిగా తెలియజేస్తున్నాను. ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వ్యాపార సంస్థలు అనేక తెలంగాణలో పెట్టుబడులు పెట్టాయంటూ" అందులో పేర్కొన్నారు. ఈ ట్వీట్ కాస్త దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. అలాగే, ప్రముఖ జర్నలిస్టులు, ఎంట్రప్రెన్యూర్‌లతో పాటు సినీ ప్రముఖులు సైతం కేటీఆర్‌కు మద్ధతు ట్వీట్లు చేస్తూ.. ఎలన్‌మస్క్‌కి ఆహ్వానం పలుకుతున్నారు. 

తాజాగా మహారాష్ట్రకు చెందిన ఒక మంత్రి దేశంలో ఎలక్ట్రిక్ కార్ల వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆఫర్ ఇచ్చారు. ఎలన్‌మస్క్‌ చేసిన ఒక ట్వీట్‌ను ఈ మహారాష్ట్ర జల వనరుల మంత్రి జయంత్ పాటిల్ రీట్వీట్‌ చేస్తూ.. "మహారాష్ట్ర భారతదేశంలోని అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో ఒకటి. మీరు కంపెనీని భారతదేశంలో స్థాపించటానికి మహారాష్ట్ర నుంచి అవసరమైన అన్ని సహాయ సహకారాలు మేము మీకు అందిస్తాము. మహారాష్ట్రలో మీ తయారీ కర్మాగారాన్ని స్థాపించమని మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం" అని పేర్కొన్నారు.

టెస్లా భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల కోసం తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తుందని మస్క్ 2020లో చెప్పారు. ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే టెస్లా అనుబంధ సంస్థను మస్క్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ బెంగళూరు వెలుపల ఉంది. మస్క్ భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేయడానికి కంటే దిగుమతి సుంకాలను తగ్గించాలని కోరుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

(చదవండి: ఎలన్‌ మస్క్‌కి టాలీవుడ్‌ ప్రముఖుల రిక్వెస్ట్‌!)

మరిన్ని వార్తలు