మహారత్న కంపెనీపై ప్రైవేటీకరణ కత్తి.. ఓఎన్‌జీసీపై కేంద్రం ఒత్తిడి

12 Nov, 2021 12:53 IST|Sakshi

ప్రైవేట్‌ భాగస్వామ్యం కోసం ఓఎన్‌జీసీపై కేంద్రం ఒత్తిడి 

న్యూఢిల్లీ: చమురు, గ్యాస్‌ ఉత్పత్తిని మరింతగా పెంచే దిశగా ప్రైవేట్‌ భాగస్వాములతో కలిసి పనిచేసేలా ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీపై కేంద్రం ఒత్తిడి పెంచుతోంది. ఇందులో భాగంగా సాధ్యమైన చోట్ల ప్రైవేట్‌ రంగ కంపెనీలు, సర్వీస్‌ ప్రొవైడర్లను కూడా భాగస్వాములను చేయాలని ఓఎన్‌జీసీకి ప్రభుత్వం సూచించినట్లు పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌ తెలిపారు. ‘దేశీయంగా మరిన్ని చమురు, గ్యాస్‌ నిక్షేపాలను వెలికితీసేందుకు, ఉత్పత్తిని పెంచేందుకు ఓఎన్‌జీసీ మరింతగా అన్వేషించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఈ విషయంలో స్పష్టమైన వైఖరితో ఉంది. ఓఎన్‌జీసీ మరింతగా కృషి చేయాలి‘ అని ఆయన పేర్కొన్నారు.

తాను స్వంతంగా అన్వేషించలేని సంక్లిష్టమైన ప్రదేశాల్లో ఓఎన్‌జీసీ ప్రైవేట్, విదేశీ కంపెనీలతో కలిసి పనిచేయాలని కపూర్‌ సూచించారు. సాంకేతిక సహకారం తీసుకోవడం మొదలుకుని పాక్షికంగా అన్వేషించిన, పూర్తిగా అభివృద్ధి చేయని నిక్షేపాలను ప్రైవేట్‌ సంస్థలకు ఇవ్వడం మొదలైన అంశాలు పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రస్తుత క్షేత్రాల నుంచి ఉత్పత్తిని మరింత పెంచుకోవడంలోనూ ప్రైవేట్‌ రంగాన్ని భాగస్వామిని చేయవచ్చని తెలిపారు. మహారత్న కంపెనీ అయినందున ఓఎన్‌జీసీకి ప్రభుత్వం సూచనలు మాత్రమే చేయగలదని, అంతిమ నిర్ణయం కంపెనీ బోర్డ్‌ తీసుకోవాల్సి ఉంటుందని కపూర్‌ తెలిపారు.  

ముంబై హై, బసేన్‌ అండ్‌ శాటిలైట్‌ (బీ అండ్‌ ఎస్‌) వంటి కీలక క్షేత్రాల్లో ప్రైవేట్‌ సంస్థలకు 60 శాతం దాకా వాటాను ఇవ్వడం పరిశీలించాలంటూ పెట్రోలియం శాఖ అదనపు కార్యదర్శి అమర్‌నాథ్‌ ఇటీవలే ఓఎన్‌జీసీకి లేఖ రాసిన నేపథ్యంలో కపూర్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
 

మరిన్ని వార్తలు