ఎంఅండ్‌ఎం సీఈఓగా అనీష్‌ షా

27 Mar, 2021 06:26 IST|Sakshi

పవన్‌ గోయెంకా స్థానంలో నియామకం

75ఏళ్ల కంపెనీ చరిత్రలో ప్రొఫెషనల్‌కు చాన్స్‌

ఎలక్ట్రిక్‌ బిజినెస్‌ కన్సాలిడేషన్‌

న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా కొత్త సీఈవోను ఎంపిక చేసుకుంది. ప్రస్తుతం కంపెనీ డిప్యూటీ ఎండీ, గ్రూప్‌ సీఎఫ్‌వోగా విధులు నిర్వహిస్తున్న అనీష్‌ షాను ఎండీ, సీఈవోగా నియమించింది. తద్వారా ఎంఅండ్‌ఎం గ్రూప్‌ చరిత్రలో తొలిసారి వృత్తిగత నిపుణుడిని సీఈవోగా ఎన్నుకున్నట్లయ్యింది. ప్రస్తుతం ఎండీ, సీఈవోగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్‌ గోయెంకా స్థానంలో అనీష్‌ ఎంఅండ్‌ఎం పగ్గాలు చేపట్టనున్నారు. 2021 ఏప్రిల్‌ 2న గోయెంకా పదవీ విరమణ చేయనున్నట్లు ఇప్పటికే ఎంఅండ్‌ఎం వెల్లడించింది. ఆనంద్‌ మహీంద్రా నాన్‌ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టనున్నట్లు గతేడాది నవంబర్‌లోనే పేర్కొంది. ఈ నేపథ్యంలో గ్రూప్‌ పగ్గాలను అనీష్‌ షా అందుకుంటున్నట్లు తెలియజేసింది.

సరైన వ్యక్తి..: సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా గత ఏడున్నర దశాబ్దాలుగా విజయాల బాటలో సాగుతున్నట్లు కొత్త సీఈవో ఎంపిక సందర్భంగా ఎంఅండ్‌ఎం గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా స్పందించారు. మహీంద్రా గ్రూప్‌నకు అనీష్‌ తగిన నాయకుడంటూ కితాబునిచ్చారు. ఎండీ, సీఈవోగా అనీష్‌.. గ్లోబల్‌ బిజినెస్‌ సహా గ్రూప్‌లోని అన్ని విభాగాలనూ పర్యవేక్షిస్తారని చెప్పారు.

2015లోనే..: అనీష్‌ షా 2015లో మహీంద్రా గ్రూప్‌లో చేరారు. గ్రూప్‌ ప్రెసిడెంట్‌గా వ్యూహాల అభివృద్ధి, డిజిటైజేషన్, డేటా సైన్స్‌ల సామర్థ్య పెంపు, వివిధ కంపెనీల మధ్య సహకారం తదితర పలు బాధ్యతలు నిర్వహించారు. ఎంఅండ్‌ఎంలో చేరకముందు జీఈ క్యాపిటల్‌ ఇండియా ప్రెసిడెంట్, సీఈవోగా ట్రాన్స్‌ఫార్మేషన్‌ బిజెనెస్‌ల బాధ్యతలను చేపట్టారు. దీనిలో భాగంగా ఎస్‌బీఐ కార్డ్‌ భాగస్వామ్య బిజినెస్‌ను టర్న్‌అరౌండ్‌ బాట పట్టించారు. జీఈలో 14 ఏళ్లపాటు యూఎస్, గ్లోబల్‌ యూనిట్లలో పలు విధులు నిర్వహించారు.

కన్సాలిడేషన్‌కు ఓకే..: అనుబంధ సంస్థ మహీంద్రా ఎలక్ట్రిక్‌ మొబిలిటీ కన్సాలిడేషన్‌ ప్రతిపాదనకు బోర్డు అనుమతించినట్లు ఎంఅండ్‌ఎం వెల్లడించింది. తద్వారా ఎలక్ట్రిక్‌ వాహనాల(ఈవీ) బిజినెస్‌కు తగిన నిధులు, వ్యూహాలకు మార్గం ఏర్పడనున్నట్లు పేర్కొంది. ఈవీ కార్యకలాపాలను లాస్ట్‌ మైల్‌ మొబిలిటీ(ఎల్‌ఎంఎం), ఎలక్ట్రిక్‌ వెహికల్‌ టెక్‌ సెంటర్‌ పేరుతో రెండు ప్రత్యేక విభాగాలుగా ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేసింది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు