మహీంద్రా చేతికి స్ప్రేయర్ల తయారీ కంపెనీ.. నెక్స్ట్ ప్లాన్ అదేనా?

21 Mar, 2023 07:03 IST|Sakshi

న్యూఢిల్లీ: స్ప్రేయర్ల తయారీ కంపెనీ మిత్రా ఆగ్రో ఎక్విప్‌మెంట్స్‌లో వాటాను 100 శాతానికి పెంచుకున్నట్టు మహీంద్రా అండ్‌ మహీంద్రా సోమవారం ప్రకటించింది. ఇప్పటి వరకు మహీంద్రాకు ఈ కంపెనీలో 47.33 శాతం వాటా ఉంది. ఓమ్నివోర్‌ పూర్తి వాటాను మహీంద్రా చేజిక్కించుకుంది. తాజా వాటాలను ఎంతకు దక్కించుకున్నదీ కంపెనీ వెల్లడించలేదు.

వ్యవసాయ యంత్రాలు, పనిముట్ల వ్యాపారంలో అయిదేళ్లలో 10 రెట్లు వృద్ధి చెందాలన్నది మహీంద్రా లక్ష్యం. వాటా కొనుగోలు సంస్థ వృద్ధికి దోహదం చేయడంతోపాటు పెరుగుతున్న ఉద్యాన పంటల రంగంలో విస్తరణకు ఆస్కారం ఉందని మహీంద్రా అండ్‌ మహీంద్రా ఫామ్‌ ఎక్విప్‌మెంట్‌ విభాగం ప్రెసిడెంట్‌ హేమంత్‌ సిక్కా తెలిపారు.

(ఇదీ చదవండి: భార‌త్‌లో 2023 టయోట ఇన్నోవా క్రిస్టా లాంచ్ - ధర ఎంతో తెలుసా?)

పండ్ల తోటల్లో వాడే స్ప్రేయర్ల తయారీలో ఉన్న మిత్రా ఆగ్రో 2012లో ప్రారంభమయింది. ఇందులో 200 పైచిలుకు ఉద్యోగులు ఉన్నారు. 2017 - 2018తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీ మూడింతల ఆదాయాన్ని ఆర్జించింది. ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. నూతన ఉత్పత్తుల తయారీతోపాటు భారత్‌ సహా విదేశీ మార్కెట్లలో విస్తరణకు యోచిస్తోంది.

మరిన్ని వార్తలు