వాతావరణ మార్పులపై పోరులో భారత్‌ ముందంజ

21 Sep, 2022 09:14 IST|Sakshi

న్యూఢిల్లీ: వాతావరణ మార్పుల (క్లైమేట్‌ చేంజ్‌)పై పోరాటంలో భారత్‌ నాయకత్వ పాత్ర పోషించగలదని, ఇప్పటికే ఎన్నో భారత కంపెనీలు అంతర్జాతీయంగా ఈ విషయంలో ముందంజలో ఉన్నట్టు మహీంద్రా గ్రూపు ఎండీ, సీఈవో అనీష్‌ షా పేర్కొన్నారు. భూమిపై వేడి అసాధారణ స్థాయిలో పెరిగిపోవడం ఎన్నో విపత్తులకు దారితీస్తుండడం తెలిసిందే.

ఇది ఇలానే కొనసాగితే విపత్కర పరిమాణాలకు దారితీస్తుందని ‘ఫిక్కీ లీడ్స్‌ 2022’ కార్యక్రమంలో భాగంగా అనీష్‌ షా చెప్పారు. ‘‘మన ప్రధాని ఎంతో సాహసోపేతమైన ప్రకటనలు చేయడాన్ని చూశాం. 2030 నాటికి 50 శాతం పునరుత్పాదక ఇంధన వనరులు ఇందులో ఒకటి. ఈ విషయంలో భారత్‌ ప్రపంచానికి నాయకత్వం వహించగలదన్న నిజాన్ని మనం అంగీకరించాల్సిందే’’అని పేర్కొన్నారు. నూతన టెక్నాలజీలు, పర్యావరణ అనుకూల మెటీరియల్స్, డీకార్బనైజింగ్‌ పరిశ్రమలతో భారత కంపెనీలు కీలకంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. కనుక భారత్‌ దీన్ని ముందుండి నడిపించాలని అభిప్రాయపడ్డారు. క్లైమేట్‌ చేంజ్‌పై పోరాటంలో భారత్‌ కీలకంగా వ్యవహరించగలదని హిందుస్థాన్‌ యూనిలీవర్‌ సీఈవో, ఎండీ సంజీవ్‌ మెహతా సైతం పేర్కొన్నారు. భారత్‌ స్థిరంగా 8–9 శాతం వృద్ధి సాధించాల్సిన అవసరాన్ని ప్రస్తావించారు.

మరిన్ని వార్తలు