సన్‌రూఫ్‌ నుంచి వాటర్ లీక్: నిజం నిరూపించిన మహీంద్రా.. వీడియో వైరల్

5 Mar, 2023 12:30 IST|Sakshi

మహీంద్రా అండ్ మహీంద్రా దేశీయ మార్కెట్లో ప్రజలు ఎక్కువ నమ్మే బ్రాండ్. అయితే ఇటీవల వెలువడిన ఒక వీడియోలో మహీంద్రా స్కార్పియో-ఎన్ సన్‌రూఫ్‌ నుంచి జలపాతం నీరు రావడం పెద్ద వైరల్ అయింది. దీనికి సమాధానంగా కంపెనీ మరో వీడియో విడుదల చేసింది.

గతంలో వెలువడిన వీడియోలో అరుణ్ పన్వర్ అనే యూట్యూబర్ తన మహీంద్రా స్కార్పియో-ఎన్ కారుని జలపాతం కిందకి తీసుకెళ్లినప్పుడు, నీరు సన్‌రూఫ్‌ నుంచి లోపలికి వచ్చాయని, దానికి సంబంధించిన వీడియో విడుదల చేసాడు. ఇది అతి తక్కువ సమయంలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది.

మహీంద్రా కంపెనీ అదే జలపాతం కిందికి మరో స్కార్పియో-ఎన్ తీసుకెళ్లి టెస్ట్ చేసింది. అయితే జలపాతం నీరు ఏమాత్రం లోపలికి రాలేదు. ఈ వీడియోను మొదటి వీడియోకి రీప్లేగా సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఇందులో జలపాతం నీరు ఏ మాత్రం లోపలికి రాకుండా ఉండటం స్పష్టంగా కనిపిస్తుంది.

నిజానికి మహీంద్రా తమ వాహనాలను పటిష్టంగా తయారు చేసి మార్కెట్లో విడుదల చేస్తుంది. అయితే కష్టమర్ కారు నుంచి ఎందుకు నీరు లోపలికి వచ్చింది అనేదానికి ఖచ్చితమైన సమాధానం తెలియదు. బాధితుడి కారులో ఏదైనా సమస్య ఉందా.. లేకుంటే పబ్లిసిటీ కోసం ఇలాంటిది ఏమైనా చేశాడా అనేది కూడా తెలియాల్సి ఉంది.

కంపెనీ ఉత్పత్తులలో ఏదైనా సమస్య తలెత్తితే తప్పకుండా దానికి పరిష్కారం పొందవచ్చు. అది మాత్రమే కాకుండా కంపెనీ అటువంటి సమస్యను గుర్తిస్తే రీకాల్ ప్రకటిస్తుంది. అలా కాకుండా వీడియోలు సోషల్ మీడియాలో వెల్లడైతే కస్టమర్లకు బ్రాండ్ మీద ఉన్న నమ్మకం పోతుంది.

జలపాతం కింద డ్రైవింగ్ చేయడం అనేది చాలా ప్రమాదం, ఇది అనుకోని ప్రమాదాలకు దారి తీస్తుంది. జలపాతం కింది నుంచి డ్రైవింగ్ చేస్తే కారు బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉండవచ్చు, లేదంటే పైనుంచి ఏదైనా కిందికి పడినప్పుడు కారులో ఉన్న ప్రయాణికులు నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. వాహన వినియోగదారులు తప్పకుండా ఇలాంటివి గుర్తుంచుకోవాలి.

మరిన్ని వార్తలు