మంచు కొండల్లో మహీంద్రా కారు రచ్చ.. రోడ్లపైకి రాకముందే అరుదైన రికార్డ్‌!

8 Jan, 2023 17:40 IST|Sakshi

మహీంద్రా కార్లుకు భారతీయ మార్కెట్లో ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ కంపెనీ వాహనాలు లాంచ్‌ చేస్తే రికార్డ్‌ బుకింగ్స్‌ అవుతుండడమే ఇందుకు నిదర్శనం. గత ఏడాది సెప్టెంబర్ నెలలో మహీంద్రా తన XUV400 ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ నెలలో ఈ కారు ధరలను కూడా ప్రకటించే అవకాశం ఉంది. కానీ ఇంతలోనే ఈ ఎలక్ట్రిక్ కారు ఒక సరికొత్త రికార్డ్ సృష్టించి అందరి కళ్లు తన వైపు తిప్పుకుంది.

మహీంద్రా కారా మజాకా
మార్కెట్లో ఇంకా అఫిషియల్‌గా లాంచ్ కాక ముందే అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. సున్నా కంటే తక్కువ ఉష్ణోగ్రతలో 24 గంటల్లో 751 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించిన మొట్టమొదటి ఎలక్ట్రిక్ వాహనంగా పేరు సంపాదించింది. హిమాచల్ ప్రదేశ్‌లోని కైలాంగ్, లాహౌల్ స్పితి నుంచి డ్రైవ్ ప్రారంభించి 24 గంటల్లో 751 కి.మీ ప్రయాణించింది.

సబ్-జీరో భూభాగంలోని నిటారుగా ఉన్న వాలులలో కూడా XUV400 సజావుగా దూసుకెళ్లింది. ఎత్తైన ప్రదేశాల్లోని వంపుల్లో కారు నడపడం కష్టతరం, అయినప్పటికీ XUV400 24 గంటల్లో 751 కిమీ ప్రయాణించి తన పనితీరుని నిరూపించుకుని ఈ అరుదైన రికార్డ్‌ను తన పేరిట నమోదు చేసుకుంది.

ప్రత్యేకతలపై ఓ లుక్కేద్దాం
XUV400 112 Ah కెపాసిటీ రేటింగ్‌తో 39.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రానుంది. బ్యాటరీ ప్యాక్‌లో NMC (నికెల్, మాంగనీస్, కోబాల్ట్) ఎలక్ట్రో-కెమికల్ కూర్పు ఉంది.

ఈ వాహనం బరువు 1,960 కిలోలు, ఇందులో బ్యాటరీ ప్యాక్ 309 కిలోల బరువు ఉంటుంది. అధికారికంగా, XUV400 8.3 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. ఇది లగ్జరీయేతర సెగ్మెంట్‌ను మినహాయించి దేశంలో తయారైన అత్యంత వేగవంతమైన ప్రయాణీకుల వాహనంగా నిలిచింది. ఈ కారు అత్యధికంగా 150 kmph స్పీడ్‌ను అందుకోగలదు.

ఖర్చులను అదుపులో ఉంచుకోవడానికి, XUV400 తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. ముఖ్యంగా బ్యాటరీ తయారీలపై ఫోకస్‌ పెట్టింది. అందుకే మహీంద్రా సహకారంతో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ వీటిని తయారు చేస్తుంది. అయితే, బ్యాటరీ కంట్రోలర్, ఎలక్ట్రిక్ మోటార్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటోంది. మహీంద్రా XUV400 ఎలక్ట్రిక్‌ కారు ధర సుమారు రూ. 17 లక్షలు లేదా అంతకంటే తక్కువ ధరకు ఉండచ్చని తెలుస్తోంది.

మరో వైపు ప్రత్యేర్థి టాటా నెక్సన్‌ ఈవీ కంటే.. ఫీచర్లు, ప్రత్యేకతలు, బ్యాటరీ సామర్థ్యం మెరుగ్గా ఉండేలా ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. చివరికి ఈ పోటీలో ఎవరు గెలుస్తారో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్‌ చేయాల్సిందే.

చదవండి: రూ.61లకే కొత్త ప్లాన్‌తో వచ్చిన రిలయన్స్‌ జియో.. ఆ కస్టమర్లకు పండగే!

మరిన్ని వార్తలు