మంటల్లో మహీంద్రా ఎక్స్‌యూవీ700: వీడియో వైరల్‌, స్పందించిన కంపెనీ 

25 May, 2023 09:35 IST|Sakshi

న్యూఢిల్లీ: మహీంద్రా పాపులర్‌ వాహనం ఎక్స్‌యూవీ 700 అగ్ని ప్రమాదం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. జైపూర్ జాతీయ రహదారిపై ఎక్స్‌యూవీ 700 మంటలు చెలరేగిన ఘటనపై  స్పందించిన మహీంద్ర, ప్రమాద కారణాలపై వివరణ ఇచ్చింది.   

ఎక్స్‌యూవీ 700  కార్‌ ఓనర్‌  కులదీప్ సింగ్ ఈ సంఘటనకు సంబంధించిన వీడియోను మే 21న, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. దీనిపై మహీంద్రా ఆటోమోటివ్ దర్యాప్తు నిర్వహించి, వైర్ ట్యాంపరింగ్ వల్లే ఎక్స్‌యూవీ 700 అగ్నిప్రమాదం జరిగిందని నిర్ధారించింది. ఈ మేరకు కంపెనీ అధికారిక ప్రకటనలను విడుదల చేసింది. (మారుతీ ‘జిమ్నీ’: మీకో గుడ్‌న్యూస్‌, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్స్‌)

 

జైపూర్ జాతీయ రహదారిపై తన కుటుంబంతో కలిసి డ్రైవింగ్ చేస్తుండగా సడెన్‌గా మంటలు వ్యాపించినట్టు కులదీప్‌ సింగ్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. కారు వేడెక్కుతోంది అనే ముంద​స్తుహెచ్చరిక లేకుండానే, పొగలు వ్యాపించి మంటల్లో చిక్కుకుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ట్వీట్‌ చేశారు. ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదని, అసలు తన కారు చాలా కొత్తదని కూడా చెప్పారు.  ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. మంటలు వ్యాపించి వాహనం దగ్ధమయ్యేలోపే ప్రయాణికులంతా బయటకు రావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. 

మహీంద్రా ఆటోమోటివ్  ప్రకటన
అగ్నిప్రమాదానికి ఖచ్చితమైన కారణాన్ని కనుగొన్నామని,వాహనం  అసలు సర్క్యూట్‌ను ట్యాంపరింగ్ చేయడం ద్వారా ఆఫ్టర్‌మార్కెట్ ఇల్యూమినేటెడ్ స్కఫ్ ప్లేట్లు , నాలుగు యాంబియంట్ లైటింగ్ మాడ్యూల్స్ వల్ల ఇది సంభవించిందని మరో ప్రకటన విడుదల చేసింది. ఎడిషనల్‌  వైరింగ్‌ కనెక్షన్‌  ఒరిజనల్‌ది కాదని , నకిలీ వైరింగ్ జీనును అమర్చినట్టు పేర్కొంది. ఇది ప్రమాదానికి దారితీసే అవకాశం ఉందని తెలిపింది.  ఈ సమాచారాన్ని కారు  ఓనర్‌కు ఈమెయిల్‌ ద్వారా అందించినట్టు కూడా తెలిపింది. 

చాలామంది తమ వాహనాలను ఎడిషనల్‌ ల్యాంప్స్ లేదా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వంటి వాటితో అప్‌డేట్‌ చేయాలనుకుంటారు అయితే, వైరింగ్ సరిగ్గా ఇన్స్టాల్ చేయకపోతే, అది షార్ట్ సర్క్యూట్కు దారితీస్తుంది. దీంతో ఎలక్ట్రికల్ సర్క్యూట్‌ వేడెక్కే ప్రమాదం ఉందని, ఇంజిన్ సరిగ్గా పనిచేసినప్పటికీ, మంటలు చెలరేగే అవకాశం ఉందని హెచ్చరించింది. అందుకే ఆఫ్టర్-మార్కెట్ పార్ట్స్‌ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు విశ్వసనీయ డీలర్‌లు, మెకానిక్‌లపై మాత్రమే ఆధారపడటం చాలా కీలకమని సూచించింది.

మరిన్ని వార్తలు