ఎంఅండ్‌ఎం లాభం జూమ్‌

11 Feb, 2022 05:58 IST|Sakshi

క్యూ3లో రూ. 1,353 కోట్లు

ఆదాయం 8 శాతం అప్‌

న్యూఢిల్లీ: ఆటో రంగ దేశీ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా(ఎంఅండ్‌ఎం) ఈ ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో స్టాండెలోన్‌ నికర లాభం రెండున్నర రెట్లు ఎగసి రూ. 1,353 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో కేవలం రూ. 531 కోట్లు ఆర్జించింది. శాంగ్‌యాంగ్‌ మోటార్‌ దివాలా కారణంగా రూ. 1,210 కోట్లమేర ప్రొవిజన్లు చేపట్టడం గతేడాది క్యూ3పై ప్రభావం చూపింది. ఇక మొత్తం ఆదా యం 8% వృద్ధితో రూ. 15,239 కోట్లకు చేరింది.  

ట్రాక్టర్‌ అమ్మకాలు డీలా...
ప్రస్తుత సమీక్షా కాలంలో ఎంఅండ్‌ఎం 2 శాతం తక్కువగా 1,18,174 వాహనాలను విక్రయించింది. ట్రాక్టర్ల అమ్మకాలు 9% క్షీణించి 91,769 యూనిట్లకు పరిమితమయ్యాయి. కాగా.. ఇదే కాలంలో కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన నికర లాభం రూ. 1,268 కోట్ల నుంచి రూ. 1,987 కోట్లకు జంప్‌చేయగా.. మొత్తం ఆదాయం రూ. 21,626 కోట్ల నుంచి రూ. 23,594 కోట్లకు పుంజుకుంది. ఈవీ విభాగంలో ఇప్పటికే త్రిచక్ర వాహనాలతో పట్టు సాధించగా.. ఫోర్‌వీలర్‌ మార్కెట్లోనూ నాయకత్వ స్థాయికి ఎదిగే వీలున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో అనిష్‌ షా పేర్కొన్నారు. క్యూ3లో సెమీకండక్టర్‌ కొరతతో 20,000 యూనిట్ల ఉత్పత్తి నష్టం ఏర్పడినట్లు కంపెనీ ఆటో విభాగం సీఈవో వీజే నక్రా వెల్లడించారు.
ఫలితాల నేపథ్యంలో ఎంఅండ్‌ఎం షేరు 1.5 శాతం నీరసించి రూ. 853 వద్ద ముగిసింది.

మరిన్ని వార్తలు